రెండురోజుల్లో బెంగాల్ పోలింగ్: మళ్లీ తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు: ఆ తరువాత పరిస్థితేంటీ?
న్యూఢిల్లీ: ఇన్నాళ్లూ వాహనదారులను చుక్కలు చూపెడుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి తగ్గాయి. వాటి రేట్లు తగ్గడం వరుసగా ఇది రెండోసారి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ రేట్లల్లో స్వల్పంగా క్షీణత కనిపించింది. వరుసగా 25 రోజుల పాటు స్థిరంగా కొనసాగిన పెట్రోల్, డీజిల్ ధరలు బుధవారం తొలిసారిగా నేల చూపులు చూశాయి. రెండో రోజు కూడా అదే పరిస్థితి కొనసాగింది.

అయిదు రాష్ట్రాల ఎన్నికల ఎఫెక్ట్..
అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పోలింగ్ ముగిసిన తరువాత మళ్లీ వాటి ధరలు మళ్లీ పెరగొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. గురువారం నాటి తాజా సవరించిన రేట్ల ప్రకారం.. పెట్రోల్ లీటరు ఒక్కింటికి 21 పైసలు, డీజిల్ లీటర్ ఒక్కింటికి 20 పైసల మేర తగ్గాయి. ఏడాది తరువాత పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రెండోరోజు కూడా తగ్గడం ఇదే తొలిసారి.

నగరాల వారీగా వివరాలివీ..
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సవరించిన రేట్ల ప్రకారం.. దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.90.78 పైసలు, డీజిల్ రూ.81.10 పైసలకు చేరింది. ముంబైలో పెట్రోలు రేటు 97.19 రూపాయలు ఉంటోంది. డీజిల్ ధర 88.20లుగా రికార్డయింది. చెన్నైలో పెట్రోలు రూ. 92.77, డీజిల్ ధర రూ. 86.10, కోల్‌కతలో పెట్రోలు రూ.90.98 పైసలు, డీజిల్ ధర రూ.83.98 పైసలు పలుకుతోంది. పుణేలో పెట్రోల్-96.83, డీజిల్-86.51, బెంగళూరులో పెట్రోల్-93.82, డీజిల్-85.99, హైదరాబాద్-94.39, డీజిల్-88.45, నొయిడాలో పెట్రోల్-89.08, డీజిల్-81.56, చండీగఢ్‌లో పెట్రోల్-87.36, డీజిల్-80.66, గుర్‌గావ్‌లో పెట్రోల్-88.73, డీజిల్-81.68 పలుకుతోంది.

క్రూడాయిల్ ధరల్లో మరో క్షీణత..
రాష్ట్రాల ప్రభుత్వాలు విధించిన విలువ ఆధారిత ధరల ప్రకారం.. వేర్వేరు చోట్ల వేర్వేరు రేట్లు ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలో క్షీణత కొనసాగుతోంది. బుధవారం 15 శాతం మేర తగ్గగా.. మరుసటి రోజు 1.8 శాతం మేర దిగజారింది. దీని ఫలితంగా దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. ఇదివరకు బ్యారెల్ క్రూడాయిల్ రేటు 71 డాలర్లు ఉండగా.. ప్రస్తుతం ఆ ధర 64 డాలర్లకు క్షీణించింది. గురువారం మరింత తగ్గి 63.27 డాలర్లకు చేరినట్లు బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ వెల్లడించింది.

27న
అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ సహా కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తోన్న విషయం తెలిసిందే. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో ఏప్రిల్ 6వ తేదీన ఒకేదశలో పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. పశ్చిమ బెంగాల్‌లో ఎనిమిది విడతలు, అస్సాంలో మూడు దశల్లో పోలింగ్‌ను కొనసాగిస్తారు. పశ్చిమ బెంగాల్‌లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శనివారం జరుగనుంది. రెండు రోజుల్లో తొలి విడత పోలింగ్ ప్రారంభం కానున్న దశలో పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.