BRICS Summit: బ్రిక్స్ సదస్సులో అమెరికా-ఇరాన్ లకు మోడీ చురకలు..!
న్యూఢిల్లీ వేదికగా రేపు ప్రారంభం కానున్న బ్రిక్స్ సదస్సుకు (BRICS Summit) ముందు నిర్వహిస్తున్న బ్రిక్స్ బిజినెస్ ఫోరం భేటీలో ప్రధాని మోడీ (PM Modi) ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. సముద్ర వాణిజ్యం, సరఫరా గొలుసులకు అంతరాయాలు పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు నౌకాయాన స్వేచ్ఛ, నావికుల భద్రత అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ వాణిజ్యానికి సురక్షితమైన, పటిష్టమైన సరఫరా గొలుసులు అత్యవసరమని ఆయన తెలిపారు. నౌకాయాన స్వేచ్ఛకు, నావికుల భద్రతకు భారత్ గట్టి మద్దతు ఇస్తుందని ప్రధాని తేల్చిచెప్పారు.
అంతకు ముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ తో భేటీ సందర్భంగా కూడా ఇవే అంశాల్ని ప్రధాని మోడీ ప్రస్తావించారు. రాజకీయ, ఆర్థిక, రక్షణ, ఇంధన, అంతరిక్ష, నైపుణ్య వలసలు, ప్రజల మధ్య సంబంధాల వంటి రంగాలలో భారత్-రష్యా సహకార పురోగతిని పుతిన్ తో కలిసి ఆయన సమీక్షించారు. సముద్ర వాణిజ్యం, భారతీయ నావికుల భద్రతపై ప్రభావం చూపిన పశ్చిమాసియా, నల్ల సముద్ర ప్రాంతంలోని ఘర్షణలతో సహా, కీలకమైన ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై కూడా వీరిద్దరూ కీలకంగా చర్చించుకున్నారు.

ఇందులో అమెరికా-ఇరాన్ దేశాల మధ్య సుదీర్ఘంగా సాగుతున్న యుద్దం కారణంగా భారత్ తో పాటు అంతర్జాతీయంగా పలు దేశాలపై పడుతున్న ప్రభావం గురించి ప్రధాని చర్చించారు. ఈ సందర్భంగా యుద్దం కొనసాగించేందుకు మొగ్గుచూపుతున్న అమెరికా-ఇరాన్ ప్రధానంగా సముద్ర వాణిజ్యంలో నౌకాయాన స్వేచ్ఛ, నావికుల భద్రతపై దృష్టిసారించాల్సిన అవసరాన్ని ప్రధాని గుర్తుచేశారు. ఇప్పటికే హార్ముజ్ లో భారతీయ సిబ్బంది ప్రయాణిస్తున్న నౌకలపై పలుమార్లు అమెరికా, ఇరాన్ దాడులు చేయడం, అందులో కొందరు చనిపోవడం కూడా జరిగింది. మరికొందరిని సురక్షితంగా రక్షించారు. అలాగే ఈ మార్గంలో నౌకాయాన స్వేచ్ఛ లేకపోవడం వల్ల భారత్ కు చమురు, గ్యాస్ రవాణాలో ఆటంకాలు ఏర్పడి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి.













Click it and Unblock the Notifications
