రైతులు, వ్యవసాయం బలోపేతం కోసమే: 100వ కిసాన్ రైలును ప్రారంభించిన మోడీ
న్యూఢిల్లీ: దేశంలో 100వ కిసాన్ రైలును ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ.. రైతులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్రలోని సంగోలా నుంచి పశ్చిమబెంగాల్‌లోని షాలిమార్ వరకు ప్రయాణించే ఈ రైలుకు సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపీ ప్రారంభించారు ప్రధాని మోడీ. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, నరేంద్ర సింగ్ తోమర పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. రైతు సాధికారతలో కిసాన్ రైలు ఓ పెద్ద ముందడుగు అని చెప్పారు. గత నాలుగు నెలల్లోనే ఈ రైలు నెట్‌వర్క్ బాగా విస్తరించిందని తెలిపారు. కిసాన్ రైలు సర్వీసులు దేశ రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ఎంతో ఉపకరిస్తున్నాయని ప్రధాని తెలిపారు.

దేశంలో 80 శాతం ఉన్న చిన్న, సన్న కారు రైతులను మరింత బలోపేతం చేస్తుందన్నారు. వ్వవసాయ రంగంలో చరిత్రాత్మక సంస్కరణలు తీసుకొచ్చామని, వ్యవసాయ రంగాన్ని, రైతులను బలోపేతం చేసేలా అనేక సంస్కరణలు చేపడుతున్నామని ప్రధాని మోడీ వివరించారు.
రైతులను, వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు తాము నిబద్ధతతో పనిచేస్తున్నామని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. కాగా, త్వరగా పాడైపోయే అవకాశం ఉన్న పండ్లు, కూరగాయల లోడింగ్, అన్ లోడింగ్ కోసం అనుమతిస్తూ కిసాన్ రైళ్లను కేంద్రం ప్రారంభించింది. అంతేగాక, రవాణా ఛార్జీలపై 50 శాతం రాయితీ కూడా రైతులకు అందిస్తోంది.
ఆగస్తు 7న మహారాష్ట్రలోని దేవ్‌లాలీ నుంచి బీహార్‌లోని దాదాపూర్ వరకు తొలి కిసాన్ రైలు ప్రారంభించగా.. దాన్ని ఆ తర్వాత ముజఫర్‌పూర్ వరకు పొడిగించింది. ఈ రైలుకు రైతుల నుంచి విశేషన స్పందన రావడంతో గతంలో వారానికి ఒక రోజు నడిచే ఈ రైలు సర్వీసును వారంలో మూడు రోజులకు పెంచారు. అంతేగాక, రైళ్ల సంఖ్యలను కూడా పెంచుతూ వచ్చారు.
Recommended Video
కాగా, పీఎం కృషి సంపాద యోజన గురించి ఆయన మాట్లాడారు, దీని కింద మెగా ఫుడ్ పార్కులు, కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్స్ వంటి 6500 ప్రాజెక్టులకు ఆమోదం లభించిందన్నారు. ప్రభుత్వ 'ఆత్మనిర్భర్' ప్యాకేజీ కింద మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు 10,000 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు ప్రధాని మోడీ తెలిపారు.












Click it and Unblock the Notifications