మొర అలకించిన మోడీ.. ఇవాళ రాత్రి పుతిన్‌తో ఫోన్ సంభాషణ, రష్యా అధినేత వినేనా..?
రష్యా యుద్దంతో ఉక్రెయిన్ దద్దరిల్లుతోంది. యుద్ద విమానాల శబ్దంతో జనం భయాందోళన చెందుతున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడాలని భారత్‌లో ఉక్రెయిన్ రాయబారి కోరిన సంగతి తెలిసిందే. దీంతో ప్రధాని మోడీ స్పందించారు. ఆయన ఇవాళ రాత్రి పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడనున్నారు. మోడీ మధ్యవర్తిత్వం పుతిన్ మనసు మారుతుందో చూడాలీ మరీ.

భారత్ జోక్యం..
ఉక్రెయిన్ స్నేహ హస్తం కోసం చూస్తోంది. ఉక్రెయిన్ మాత్రం భారత్ జోక్యం చేసుకోవాలని కోరుతుంది. రష్యాతో భారత్ అనుబంధం ప్రత్యేకమైంది. భారత్- పాక్ ఘర్షణ సమయంలో అమెరికా పాక్ వైపు నిలబడితే.. రష్యా భారత వైపున నిలుచుంది. ఈ క్రమంలో భారత్ చెబితే రష్యా వింటుందని ఉక్రెయిన్ భావిస్తోంది. ఇరుదేశాల మధ్య అనుబంధం ఉండటంతో.. ఇండియా మాటకు రష్యా గౌరవం ఇస్తోందని అభిప్రాయపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెంటనే జోక్యం చేసుకోవాలని ఉక్రెయిన్ కోరింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడాలని అడుగింది. ఈ మేరకు తమ అధ్యక్షుడు జెలన్స్కీ కోరారని భారత్‌లో ఉక్రెయిన్ రాయబరి ఇగొర్ పొలిఖా పేర్కొన్నారు. దీంతో ప్రధాని రియాక్ట్ అయ్యారు.

24 గంటలు అందుబాటులో
అయితే రష్యా- ఉక్రెయిన్ యుద్దంపై భారత్ తటస్థ వైఖరిని అవలంభిస్తోంది. ఏ దేశం వైపు నిలవబోమని కుండబద్దలు కొట్టింది. కానీ శాంతిని పునరుద్దరించేందుకు చర్యలు మాత్రం తీసుకోవాలని కోరుతుంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ మధ్యవర్తిత్వం వహించాలని కోరడం విశేషం. ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులను దేశం తీసుకురావడంపై దృష్టిసారించామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. వారి కోసం 24 గంటలపాటు అందుబాటులో కంట్రోల్ రూమ్ ఉంటుందని వివరించింది.

మోడీ సమావేశం..
ఇటు రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలపై ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ ఉన్నతస్థాయి సమీక్షలో హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, పలు విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. యుద్ధ పరిణామాలు, భారత్ పై తక్షణ ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.

18 వేల మంది
ఇటు ఉక్రెయిన్‌లో దాదాపు 18 వేల మంది భారతీయులు ఉన్నారు. వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ తెలిపారు. ఉక్రెయిన్‌లో గగనతలం మూసివేసిన క్రమంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. ఉక్రెయిన్‌లోని భారతీయులందరి భద్రతకు కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తుందని చెప్పారు.












Click it and Unblock the Notifications