దీపావళి కానుక- రేట్లు భారీగా తగ్గింపు
యావత్ దేశం 79వ స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకొంటోంది. దేశం మొత్తం త్రివర్ణ పతాకాలతో రెపరెపలాడుతోంది. నయా భారత్.. అనే థీమ్‌తో ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాన్ని వైభవంగా జరుపుకొంటున్నారు దేశ ప్రజలందరూ. జాతీయ సమగ్రత, దేశాభివృద్ధికి సంకేతంగా ఈ థీమ్‌ను రూపొందించింది ప్రభుత్వం.
పంద్రాగస్టు వేడుకలను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి కిందటే దేశ రాజధానిలోని ఎర్రకోటపై మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేశారు. జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తోన్నారు. దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు.అసేతు హిమాచలం.. వందేమాతరం అనే నినాదం వినిపిస్తోందని అన్నారు.

తన ప్రసంగంలో ఆపరేషన్ సింధూర్ ను ప్రస్తావించారు ప్రధాని మోదీ. శత్రువులను అంచనాలకు మించిన స్థాయిలో దెబ్బతీశామని, వాళ్ల వెన్ను విరిచామని అన్నారు. దేశ ప్రజలపై తుపాకి ఎక్కుపెట్టిన శత్రువులు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదనడానికి ఆపరేషన్ సింధూర్ ఓ తాజా ఉదాహరణ అని మోదీ చెప్పారు.
అనంతరం భారీ ప్రకటన చేశారు ప్రధాని మోదీ. ఈ దీపావళి పండగ నాటికి నెక్స్ట్ జెన్ జీఎస్టీ (Next-Gen GST) వ్యవస్థను అమలు చేయనున్నట్లు తెలిపారు. పన్నుల రేట్లను గణనీయంగా తగ్గిస్తామని అన్నారు. ఈ పన్నుల తగ్గింపును సాధారణ ప్రజలు, సూక్ష్మ- చిన్న- మధ్య తరహా పరిశ్రమల (MSMEs)కు ఓ బహుమతిగా ఆయన అభివర్ణించారు. ఆర్థిక వ్యవస్థలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుడతామని అన్నారు.
ఎర్రకోట నుండి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ప్రధాని మోదీ జీఎస్టీ సంస్కరణల గురించి ప్రస్తావించారు. ఎనిమిది సంవత్సరాలుగా జీఎస్టీ సంస్కరణలను అమలు చేస్తూ వచ్చామని, పన్నులను సరళీకృతం చేశామని గుర్తు చేశారు. జీఎస్టీ వ్యవస్థను పునఃసమీక్షించి, రాష్ట్రాలతో సంప్రదించిన తర్వాత, కొత్త సంస్కరణలను ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు.
ఈ దీపావళికి నేను ఒక గొప్ప బహుమతి ఇవ్వబోతున్నాను. గత ఎనిమిదేళ్లుగా.. మేము జీఎస్టీ సంస్కరణను అమలు చేసి పన్నులను సరళీకృతం చేశాం. ఇప్పుడు- దాన్ని పునః సమీక్షించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇదివరకే ఈ కార్యక్రమం చేపట్టాం. రాష్ట్రాలతో సంప్రదించాం.నెక్స్ట్ జెన్ జీఎస్టీ సంస్కరణను ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం.. అని ప్రకటించారు.
ఈ నూతన సంస్కరణల వల్ల అవసరమైన సేవలపై పన్నులు గణనీయంగా తగ్గుతాయని, ఇది వ్యక్తిగత పౌరులకు ప్రయోజనకరమని మోదీ తెలిపారు. అంతేకాకుండా, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కూడా లబ్ధి పొందుతాయని, దీని ద్వారా ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతం లభిస్తుందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications