ప్రధాని విమానంలో సురక్షితం కాని సమాచార వ్యవస్థ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ఉపయోగిస్తున్న బోయింగ్ బిజినెస్ జెట్ విమానాల్లో సురక్షితమైన కమ్యూనికేషన్ వ్యవస్థ లేదనే సంచలన వాస్తవాన్ని కాగ్ తేటతెల్లం చేసింది. దీనివల్ల ప్రధాని, భూకేంద్రంలో ఉన్నవారి మధ్య సాగే సంభాషణలను విద్రోహ శక్తులు రహస్యంగా వినే ప్రమాదముందని తెలిపింది.
డీఆర్డీవో అత్యవసరంగా చేపట్టిన ప్రాజెక్టులపై పరిశీలన జరిపినప్పుడు ఈ విషయం వెల్లడైందని శుక్రవారం పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో కాగ్ పేర్కొంది. అమెరికా నుంచి కొనుగోలు చేసిన బోయింగ్ బిజినెస్ జెట్ విమానాలను ప్రధాని పర్యటనల కోసం వైమానిక దళం వినియోగిస్తోంది.
వాటిలో అంతర్గతంగానే వీడియో టెలి కాన్ఫరెన్సింగ్ సౌకర్యం ఉంది. అయితే అది ఎన్‌క్రిప్ట్ రూపంలో లేదు. ఎన్‌క్రిప్షన్ వల్ల సమాచారం సంకేత సందేశాల రూపంలో బట్వాడా అవుతుంది. దాన్ని అథీకృత వ్యక్తులు తప్ప మిగతావరెవరూ వినలేరు. సమాచార భద్రతకు ఇది సమర్థ విధానం.

అయితే ప్రధాన మంత్రి విమానాల్లో ఇది లేదు. భద్రమైన కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని 2006 అక్టోబర్‌లోనే గుర్తించినా ఇప్పటి వరకు అది సాధ్యం కాలేదు. ఆ విమానాలు 2008 ఆగస్టు నుంచి 2009 జనవరి మధ్య వైమానిక దళంలో చేరాయి.
అప్పటి నుంచి వాటిని సురక్షిత సమాచార వ్యవస్థ లేకుండానే నిర్వహిస్తున్నారు. ఎన్‌క్రిప్టెడ్ సమాచార వ్యవస్థను దేశీయంగా రూపొందించాలని భారత వైమానిక దళం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా బెంగళూరులోని డీఆర్డీవోకు చెందిన కెయిర్‌కు ఆ బాధ్యత అప్పగించారు. కెయిర్ ఈ ఏడాది జూన్‌లో కమ్యూనికేషన్ వ్యవస్థను వైమానిక దళానికి అప్పగించింది. దీనికి వైమానిక దళం ఇంకా ఆమోదించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications