KSRTC బస్టాండ్ లో.. అందరూ చూస్తుండగా: సీసీటీవీ ఫుటేజీలో.. !!
కర్ణాటకలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించట్లేదనే కారణంతో ఓ యువతిపై దాడికి దిగాడు. మచ్చుకత్తితో నరికేశాడు. కేఎస్ఆర్టీసీ బస్టాండ్ లో పట్టపగలు అందరూ చూస్తోండగానే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో దాడికి గురైన యువతి తీవ్ర గాయాల పాలైంది. పోలీసులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం దక్కలేదు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది.
మృతురాలి పేరు లావణ్య. వయస్సు 21 సంవత్సరాలు. దక్షిణ కన్నడ జిల్లాలోని కక్కెపదవు ఆమె స్వగ్రామం. కల్లడ్కలో ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో నర్సుగా పని చేస్తోంది. రోజూ ఇంటి నుంచి కల్లడ్కకు బస్సులో వెళ్లివస్తుంటుంది. అదే ప్రాంతానికి చెందిన ఆమె దూరపు బంధువు చేతన్.. కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ లావణ్య వెంటపడేవాడు. తరచూ వేధింపులకు గురిచేస్తుండే వాడు. అతని ప్రేమను లావణ్య అంగీకరించలేదు. అతనిని దూరం పెడుతూ వచ్చింది.

వేధింపులు మితిమీరిపోయినా ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. దీంతో లావణ్యపై చేతన్ కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమెను మట్టుబెట్టాలని ముందే పథకం రచించుకున్నాడు. గురువారం సాయంత్రం కల్లడ్క నుంచి లావణ్య తన గ్రామానికి వెళ్ళడానికి స్థానిక బంట్వాళ బీసీ రోడ్ కేఎస్ఆర్టీసీ బస్టాండ్ కు చేరుకుంది. కక్కెపదవు వెళ్లే బస్సులో కూర్చుంది. సరిగ్గా అదే సమయంలో ఆమెను వెంబడిస్తూ వచ్చిన చేతన్.. బస్సులోకి చొరబడి ప్రయాణికుల ముందే ఆమెను బలవంతంగా బయటకు లాగి రోడ్డుపై పడేశాడు.
వెంట తెచ్చుకున్న మచ్చుకత్తితో ఆమె తల, చేతులపైన విచక్షణారహితంగా దాడి చేశాడు. అక్కడి నుండి పరారయ్యాడు. ఈ హఠాత్పరిణామానికి ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న లావణ్యను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి పూర్తిగా విషమించడంతో డాక్టర్లు ఎంత ప్రయత్నించినప్పటికీ ఆమె ప్రాణాలను నిలపలేకపోయారు.
సమాచారం అందుకున్న బంట్వాళ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. దక్షిణ కన్నడ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అరుణ్ కుమార్ కూడా సైతం సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘాతుకానికి సంబంధించిన ఆధారాలను సేకరించడమే కాకుండా, నిందితుడు తప్పించుకోవడానికి ఏఏ మార్గాలను ఉపయోగించాడనే దానిపై క్లూస్ టీమ్, సీసీటీవీ ఫుటేజీలను విశ్లేషిస్తున్నారు.
నిందితుడు చేతన్‌ను పట్టుకోవడానికి రెండు ప్రత్యేక బృందాలను నియమించారు. నిందితుడి మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని, కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ అరుణ్ కుమార్ చెప్పారు. ఈ ఘటనతో బాధితురాలి స్వగ్రామం, బంట్వాళ్ ప్రాంతమంతా విషాద ఛాయలు అలముకున్నాయి.












Click it and Unblock the Notifications