పాక్ జర్నలిస్ట్‌తో అఫైర్, ఐపీఎల్: సునంద కేసులో జర్నలిస్టుల విచారణ
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ మృతి కేసులో ప్రత్యేక దర్యాఫ్త సంస్థ గురువారం నాడు పలువురు జర్నలిస్టులను ప్రశ్నించింది. సునంద పుష్కర్ మృతికి ముందు ఏఏ విలేకరులతో మాట్లాడారో.. వారిని విచారించారు.
సునంద పుష్కర్ హత్య కేసు ఇటీవల ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును చేధించేందుకు ఢిల్లీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సునంద భర్త, కాంగ్రెస్ మాజీ మంత్రి శశిథరూర్‌ను, పలువురిని ప్రశ్నించారు. ఇప్పుడు కొందరు మహిళా, పురుష జర్నలిస్టుల నుంచి వివరాలు సేకరించారు.

సునంద పుష్కర్ చనిపోవడానికి ముందు కొందరు మహిళా జర్నలిస్టులతో ఫోన్‌లో మాట్లాడిన విషయం తెలిసిందే. వారిని ప్రశ్నించడం ద్వారా కీలక విషయాలు రాబట్టాలని పోలీసులు భావిస్తున్నారు. జర్నలిస్టులు చెప్పిన విషయాలతో శశిథరూర్ చెప్పిన వివరాలను పోల్చుకోనున్నారు.
మహిళా జర్నలిస్టులతో ఐపీఎల్ విషయం, లేదా పాకిస్తాన్ జర్నలిస్ట్ మెహర్ తరర్ విషయాలు ఏమైనా చెప్పారా అని ఆరా తీసే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. ఆమె అసలు విలేకరుల సమావేశం ఎందుకు పెట్టాలనుకున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
శశిథరూర్‌కు మెహర్ తరర్‌తో అఫైర్, ఐపీఎల్ విషయంలో సునంద నోరు విప్పేందుకు ప్రయత్నాలు చేశారనే వార్తల నేపథ్యంలో దర్యాఫ్తు బృందం గురువారం నాడు ఇద్దరు మహిళా జర్నలిస్టులను, ఒక పురుష జర్నలిస్టును విచారించిందని తెలుస్తోంది. కాగా, సునందది హత్యేనని నిర్ధారించుకున్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications