నిమిష ప్రియ వచ్చేస్తోంది..! టర్కీ నుంచి కేఏ పాల్ సంచలన ప్రకటన..!
గల్ఫ్ దేశం యెమెన్ లో వ్యాపార భాగస్వామిని హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొంటూ ఉరిశిక్ష పడిన కేరళ నర్సు నిమిష ప్రియను విడిపించేందుకు భారత ప్రభుత్వంతో పాటు పలువురు ముస్లిం నాయకులు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఆమె ఉరిశిక్షను సైతం వీరు తాత్కాలికంగా వాయిదా వేయించారు. ఈ నేపథ్యంలో టర్కీ నుంచి నిమిష ప్రియ విడుదల కోసం అక్కడి నేతలతో కేఏ పాల్ జరుపుతున్న చర్చలు ఫలించినట్లు ప్రకటించారు.
యెమెన్ లో రెండు ప్రభుత్వాలు ఉండటం, అందులో హౌతీ రెబెల్స్ కు చెందిన ప్రభుత్వం నిమిష ప్రియను దోషిగా నిర్ధారించి ఉరిశిక్ష విధించడం, ఆ ప్రభుత్వంతో భారత ప్రభుత్వానికి దౌత్య సంబంధాలు లేకపోవడంతో ఇతరత్రా మార్గాల్లో ఆమెను రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో కేరళకు చెందిన ముస్లిం నాయకుడు కాంతాపురం అబూబకర్ ముస్లియార్ హౌతీ నాయకులతో ఇప్పటికే పలుమార్లు చర్చించారు. అదే సమయంలో యెమెన్ పొరుగున ఉన్న దేశాల నాయకులతో పాటు హౌతీ నాయకులతోనూ చర్చించిన కేఏ పాల్ ఫలితం సాధించినట్లు చెప్తున్నారు.

టర్కీ రాజధాని ఇస్తాంబుల్ నుంచి ఓ వీడియో విడుదల చేసిన పాల్.. నిమిషప్రియను విడిపించేందుకు తాను చేస్తున్న ప్రయత్నాలు ఫలించినట్లు వెల్లడించారు. వారం రోజుల పాటు నిమిష ప్రియ ఉరిశిక్షను తొలుత వాయిదా వేయించామని, అయితే ఇప్పుడు మృతుడి కుటుంబంతో జరిపిన చర్చలతో మరో నాలుగు రోజుల్లో ఆమెను విడుదల చేసేందుకు అంగీకరించారని పాల్ చెప్తున్నారు. నాలుగు రోజుల్లో గుడ్ న్యూస్ వింటామని పాల్ తెలిపారు.

ప్రధాని మోడీ ట్వీట్ చేసినా చేయకపోయినా, విదేశాంగమంత్రి జైశంకర్ మద్దతిచ్చినా ఇవ్వకపోయినా మీతోనే ఉన్నాం.. నిమిష ప్రియను విడుదల చేయించకుండా రావొద్దని తన అభిమానులు కోరారని, అందుకే వారం రోజులుగా ఇక్కడే ఉన్నట్లు పాల్ తెలిపారు. దేవుడి దయవల్ల నిమిష ప్రియ క్షేమంగా విడుదలవుతుందని, ఆమెను తానే స్వయంగా తీసుకురావాలా లేక ఇతర మార్గాల్లో ఆమె కేరళ వస్తుందా అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉందన్నారు.












Click it and Unblock the Notifications