వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ: 'ప్రజల ఆకలి తీర్చడానికి మూడు వారాల్లో జాతీయ విధానం ఖరారు చేయండి' -ప్రెస్ రివ్యూ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
సీజేఐ ఎన్వీ రమణ

దేశంలో ప్రజల ఆకలి తీర్చడానికి 3 వారాల్లో ఒక జాతీయ స్థాయి విధానాన్ని ఖరారు చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేంద్రాన్ని ఆదేశించారని ఆంధ్రజ్యోతి దిన పత్రిక వార్త ప్రచురించింది.

ఆకలితో మరణిస్తున్న ప్రజలకు ఆహారం అందించడం సంక్షేమ రాజ్యం ప్రథమ బాధ్యత అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ స్పష్టం చేశారు.

'ప్రజల ఆకలి తీరుస్తామంటే ఏ రాజ్యాంగమూ, ఏ చట్టమూ కాదనలేదు. రాష్ట్రాలతో చర్చించి ప్రజల ఆకలి తీర్చేందుకు కమ్యూనిటీ కిచెన్స్ (సామూహిక వంటశాలల)పై జాతీయ స్థాయి విధానాన్ని 3 వారాల్లో ఖరారు చేయండి. ఇదే మీకు చివరి అవకాశం' అని కేంద్రాన్ని ఆదేశించారని ఆంధ్రజ్యోతి రాసింది.

దేశంలో ఆకలి చావులను నివారించేందుకు కమ్యూనిటీ కిచెన్‌ విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ అనున్‌ ధావన్‌ తదితరులు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌)పై మంగళవారం జస్టిస్‌ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది.

కమ్యూనిటీ కిచెన్‌ల విషయంలో తాము అక్టోబరు 27న ఆదేశించినప్పటికీ, కేంద్రం సరైన విధానాన్ని అఫిడవిట్‌లో స్పష్టం చేయకపోవడం పట్ల జస్టిస్‌ రమణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని పత్రిక రాసింది.

'మీ అండర్‌ సెక్రటరీ ద్వారా అఫిడవిట్‌ దాఖలు చేయించడమేమిటి? కార్యదర్శి ద్వారా దాఖలు చేయించలేరా? కేంద్ర ప్రభుత్వానికి ఇదే మా చివరి హెచ్చరిక. మేం ఎన్నిసార్లు చెప్పాలి' అని జస్టిస్‌ రమణ ఆగ్రహించే సరికి అప్పటి వరకూ మరో కేసు విచారణలో ఉన్న అటార్నీ జనరల్‌ వేణుగోపాల్‌ వీడియో ముందుకు వచ్చారు.

'మిస్టర్‌ ఏజీ.. మీరే చెప్పండి మేం ఏం చేయాలో? మీ అండర్‌ సెక్రటరీ అఫిడవిట్‌ వేశారు' అని జస్టిస్‌ రమణ అన్నారు.

దీంతో కేంద్రం ఒక నిర్దిషమైన పథకంతో ముందుకు వస్తుందని, జాతీయ భద్రతా చట్టం పరిధిలో ఒక విధానాన్ని రూపొందిస్తామని ఏజీ చెప్పారని ఆంధ్రజ్యోతి వివరించింది.

పోచంపల్లి

పోచంపల్లికి అంతర్జాతీయ గుర్తింపు

పోచంపల్లికి ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ గుర్తింపు లభించిందని ఈనాడు దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

పట్టుచీరలకు పుట్టినిల్లయిన యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్‌ పోచంపల్లికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది.

ఐరాస ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్‌డబ్ల్యూటీవో) ఉత్తమ పర్యాటక గ్రామంగా దీన్ని ఎంపిక చేసింది.

డిసెంబరు 2న స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌లో జరిగే యూఎన్‌డబ్ల్యూటీవో జనరల్‌ అసెంబ్లీ 24వ సమావేశం సందర్భంగా ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందజేస్తారని పత్రిక చెప్పింది.

తొమ్మిది ప్రత్యేక అంశాల్లో అత్యుత్తమ విధానాలను అవలంబిస్తూ గ్రామీణ గమ్యస్థానాలుగా మారిన ప్రాంతాలకు యూఎన్‌డబ్ల్యూటీవో ఉత్తమ పర్యాటక గ్రామాల అవార్డులు ఇవ్వడం ప్రారంభించింది.

బహిరంగ మార్కెట్‌లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకొనేలా స్థానికులకు శిక్షణ ఇచ్చి గ్రామీణ పర్యాటక సామర్థ్యాన్ని పెంచడం దీని ప్రధాన లక్ష్యం. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం భారత్‌ నుంచి మూడు గ్రామాలను ఈ అవార్డుకు ప్రతిపాదించింది.

ఇందులో మేఘాలయలోని కోంగ్‌థాంగ్‌, మధ్యప్రదేశ్‌లోని లాధ్‌పురా ఖాస్‌, తెలంగాణలోని పోచంపల్లి ఉన్నాయి. ఇందులో పోచంపల్లి ప్రతిష్ఠాత్మక ఉత్తమ పర్యాటక గ్రామ అవార్డుకి ఎంపికైందని ఈనాడు వివరించింది.

రైల్వే

ఇక అన్ని రైళ్లూ రెగ్యులర్

కోవిడ్ వల్ల ప్రత్యేక రైళ్లు నడుపుతున్న రైల్వే శాఖ ఇక అన్ని రైళ్లనూ రెగ్యులర్‌గా మారుస్తున్నట్లు ప్రకటించిందని సాక్షి దిన పత్రిక వార్త ప్రచురించింది.

దేశంలో కోవిడ్‌ కారణంగా విధించిన లాక్‌డౌన్‌ తరువాత విడతల వారీగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్న రైల్వేశాఖ.. కోవిడ్‌ తగ్గుముఖం పట్టడంతో ఇప్పటి నుంచి అన్నీ రెగ్యులర్‌ రైళ్లుగా మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ మార్పు వెంటనే అమలులోకి వస్తున్నట్లు ప్రకటించింది.

ప్రయాణికుల అనవసర ప్రయాణాన్ని తగ్గించే ఉద్దేశంతో అదనపు చార్జీలు విధించి 'సున్నా' నంబర్‌తో మొదలయ్యే ప్రత్యేక రైళ్లను తొలుత దూర ప్రాంతాల మధ్య నడిపి, అనంతరం తక్కువ దూరం మధ్య పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, ప్యాసింజర్‌ రైళ్లను నడపడం ప్రారంభించిందని పత్రిక చెప్పింది.

దాదాపు అన్ని ప్యాసింజర్‌ రైళ్లు ప్రత్యేక రైళ్ల పేరుతో నడుస్తున్నాయి.

ప్రత్యేక రైళ్లలో సాధారణ చార్జీల కంటే అధికంగా ఉండటంతో పాటు రైల్వేశాఖ ప్రత్యేక ప్రయాణికులకు అందిస్తున్న రాయితీలు కూడా ఉండవు.

దీంతో ప్రయాణికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దీనిపై దృష్టి పెట్టిన రైల్వేశాఖ ఇప్పటి నుంచి విడతల వారీగా ప్రత్యేక రైళ్ల స్థానంలో కరోనాకు ముందు ఉండే విధంగా సాధారణ రైలు నంబర్లతో, పాత చార్జీలతోనే రెగ్యులర్‌ రైళ్లు నడిపేలా చర్యలు చేపట్టింది.

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 2021 రైల్వే టైంటేబుల్‌ ప్రకారం దాదాపుగా అన్ని రైళ్లు రెగ్యులర్‌ రైళ్లుగా నడవనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారని సాక్షి వివరించింది.

తెలంగాణ ప్రభుత్వం ధర్నా

కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరికి నిరసనగా రేపు(నవంబర్ 18) తెలంగాణ ప్రభుత్వం ఇందిరా పార్క్ దగ్గర ధర్నా నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినట్లు నమస్తే తెలంగాణ దిన పత్రిక వార్త ప్రచురించింది.

తెలంగాణ రైతాంగం కోసం రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రంపై ప్రత్యక్ష యుద్ధానికి దిగింది.

ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 18న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌ వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.

కేంద్రంలోని బీజేపీ సర్కారు ద్వంద్వ వైఖరి, రాష్ట్ర బీజేపీ నేతల తీరును ఎండగడుతూ పోరాటానికి సిద్ధమవుతున్నట్టు చెప్పారని పత్రిక రాసింది.

మంగళవారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పష్టత ఇవ్వకుంటే అన్ని వేదికలపైనా పోరాటం కొనసాగిస్తామని తేల్చి చెప్పారు.

యాసంగిలో వరి వేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలకు ఆయన కట్టుబడి ఉన్నారో లేదో చెప్పాలని.. తప్పుగా చెప్పి ఉంటే ముక్కు నేలకు రాసి.. రైతాంగానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారని పత్రిక వివరించింది..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Prepare a national policy to reduce hunger in people says CJI NV Ramana
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X