IPL 2026: దెబ్బతీసిన రబాడ, హోల్డర్.. SRH ఘోర పరాజయం
ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అనూహ్య పరాజయం ఎదురైంది. మంగళవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన గుజరాత్ టైటాన్స్ 83 పరుగుల భారీ తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తు చేసింది.
168 పరుగుల సాధారణ లక్ష్యఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 14.5 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. పాట్ కమిన్స్(19)తో సహా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో కగిసో రబడా(3/28), జాసన్ హోల్డర్(3/20) మూడేసి వికెట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ పతనాన్ని శాసించగా.. ప్రసిధ్ కృష్ణ(2/23)రెండు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ సిరాజ్, రషీద్ ఖాన్‌కు చెరో వికెట్ దక్కింది.
ప్లే ఆఫ్స్‌కు గుజరాత్
అంతకుముందు గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులు చేసింది. సాయి సుదర్శన్(44 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 61), వాషింగ్టన్ సుందర్(33 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 50) హాఫ్ సెంచరీలతో రాణించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో సాకీబ్ హుస్సేన్(2/37), ప్రఫుల్ హింగే(2/17) రెండేసి వికెట్లు తీయగా.. పాట్ కమిన్స్(1/20) ఒక వికెట్ పడగొట్టాడు.

ఈ ఘోర పరాజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ నెట్ రన్‌రేట్(0.331) దారుణంగా పడిపోగా.. గుజరాత్ టైటాన్స్ రన్ రేట్(0.551) రెట్టింపు అయ్యింది. ఈ భారీ విజయంతో పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానాన్ని అందుకున్న గుజరాత్ టైటాన్స్ 8 విజయాలతో ప్లే ఆఫ్స్ బెర్త్‌ను కూడా దాదాపు ఖరారు చేసుకుంది.
రఫ్ఫాడించిన రబాడ, హోల్డర్
169 పరుగుల లక్ష్యఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. వికెట్‌తో పాటు మెయిడిన్ ఓవర్‌తో సిరాజ్ ఆరెంజ్ ఆర్మీకి షాకిచ్చాడు. ట్రావిస్ హెడ్(0)ను ఔట్ చేయడంతో పాటు ఒక్క పరుగు ఇవ్వలేదు. రబడా వేసిన మరుసటి ఓవర్లో సిక్స్ బాది జోరు కనబర్చిన అభిషేక్ శర్మ(6).. నాలుగో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇషాన్ కిషన్(11) కూడా సిక్స్, బౌండరీతో దూకుడు కనబర్చాడు. కానీ రబాడ మరుసటి ఓవర్లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
పవర్ ప్లే చివరి ఓవర్లో స్మరణ్ రవిచంద్రన్(9)ను రబాడ ఔట్ చేయడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 34 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత జాసన్ హోల్డర్ సన్‌రైజర్స్ పతనాన్ని శాసించాడు. కాస్త దూకుడుగా ఆడిన సలీల్ అరోరా(16)ను ప్రసిధ్ కృష్ణ ఔట్ చేయగా.. హెన్రీచ్ క్లాసెన్(14),నితీష్ రెడ్డి(2)లను హోల్డర్ ఒకే ఓవర్లో పెవిలియన్ చేర్చి సన్‌రైజర్స్‌ను కోలుకోలేని దెబ్బతీసాడు.
కమిన్స్ ఆడినా..
హోల్డర్ తన ఆఖరి ఓవర్లో శివాంగ్ కుమార్(4)ను ఔట్ చేయగా.. దూకుడుగా ఆడిన కమిన్స్(19)ను ప్రసిధ్ కృష్ణ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆఖరి వికెట్‌గా ప్రఫుల్ హింగే(3)ను రషీద్ ఖాన్ స్టంపౌట్ చేయడంతో గుజరాత్ టైటాన్స్ విజయం లాంఛనమైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ చేరాాలంటే తమ చివరి రెండు మ్యాచ్‌లకు రెండు గెలవాలి. ఒకటి ఓడి మరొకటి గెలిచినా.. రెండు మ్యాచ్‌ల్లో ఓడినా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications