• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Price Rise-Hyderabad: ఒక సామాన్య మధ్యతరగతి ఇల్లాలిపై నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల ప్రభావం ఎలా ఉంటుంది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
సునీత

గత రెండేళ్ల పేద, మధ్య తరగతి వర్గాలను ఎవర్ని కదిలించినా, పది మాటల్లో కనీసం రెండు మూడైనా పెరిగిన ధరల గురించే ఉంటున్నాయి. పెట్రోల్, వంట నూనె, కరెంట్ బిల్, పాల పాకెట్… వస్తువు ఏదైనా పెరుగుదల అనే పాయింట్ మాత్రం కామన్. తినడమూ, ఖర్చు పెట్టడమూ మానలేము. మరి ఈ అంశంపై ఇప్పుడు ఇంత చర్చ ఎందుకు జరుగుతోంది?

ద్రవ్యోల్బణం లాంటి పెద్ద పెద్ద మాటలు వాడకుండా, ఒక సామాన్య మధ్యతరగతి ఇల్లాలి దగ్గర కూర్చుని ధరల పెరుగుదల ఆమెను ఎలా ప్రభావితం చేసిందో తెలుసుకునే ప్రయత్నం చేశాం. రాజకీయ నాయకులు తరచూ మాట్లాడే, ధర్నాలు చేసే, గ్యాస్ సిలెంటర్లు నెత్తిన పెట్టుకుని, ఎడ్ల బండిపై వెళుతూ చేసే ప్రదర్శనలన్నీ ఒకవైపు.. ఆర్టీసీ బస్సులో కూర్చునో, బైక్ పై వెళ్తూనో, షేర్ ఆటోలో నుంచి తొంగి చూసి ఆ ఆందోళనకు కారణం తెలుసుకుని నిట్టూర్చే మధ్య తరగతి, పేదలు మరోవైపు.

ఇంతకీ ధరల పెరుగుదల సామాన్య కుటుంబాన్ని ఎలా ప్రభావితం చేసిందో చూద్దాం. ఈ విషయం కోసం ఒక కేస్ స్టడీగా హైదరాబాద్ కాచీగూడ ప్రాంతంలో ఉంటోన్న సునీత అనే మహిళతో మాట్లాడింది బీబీసీ. ఆమె ఒక ప్రైవేటు స్కూల్లో తెలుగు టీచర్ గా పనిచేస్తున్నారు. ఆమె భర్త కూడా ప్రైవేటు ఉద్యోగి. ఇద్దరు పిల్లలు డిగ్రీ చదువుతున్నారు. మేం ఆమెతో మాట్లాడినప్పుడు ఆవిడ చెప్పిన ధరల్లో మీకు అనుభవంలోకి వచ్చిన ధరల్లో కాస్త వ్యత్యాసం ఉండవచ్చు. స్థలం, కాలంతో పాటూ బ్రాండ్స్ కూడా ఆ వ్యత్యాసానికి కారణం కావచ్చు.

సునీతకు కరోనా సమయం చాలా కష్టంగా గడిచింది. ఎందుకంటే ఆమె ప్రైవేటు స్కూల్ టీచర్ కావడంతో ఏడాదిన్నర పాటూ అసలు జీతమే లేదు. ఆ తరువాత ఆన్లైన్ క్లాసులు మొదలయ్యాక సగం జీతమే ఉండేది. ఇప్పుడు కాస్త ఫర్వాలేదనిపించే పరిస్థితి ఉంది. ప్రతీ నెలా పూర్తి జీతం కాకపోయినా, గతం అంతే దుర్భరంగా లేదు ప్రస్తుత పరిస్థితి. ఆమె భర్తకు కరోనా సమయంలో సగం జీతం వచ్చింది అని చెప్పారు సునీత.

కిరాణా కొట్టులో నిత్యావసర వస్తువులు

ధరల గురించి ఆమెను కదిలించినప్పుడు సుదీర్ఘంగా చెప్పుకొచ్చారు. ధరల పెరుగుదల అనగానే ఆమె నోటి నుంచి వచ్చిన మొదటి మాట నూనె పాకెట్. అవును ఇప్పుడు భారతదేశాన్ని కుతకుతలాడిస్తోంది, మధ్య తరగతిని బాణీలో వేయించుకుని తింటోంది వంట నూనే.

''ధరలు అంటే ఫస్ట్ చెప్పాల్సింది ఆయిల్. ఆయిల్ రేట్ 2019 ప్రాంతంలో 90 రూపాయలు సుమారుగా ఉండేది. తరువాత 120 అయింది. ఇప్పుడు 220 వరకూ పెరిగింది. అది మామూలు పెరుగుదల కాదు. అసలు వంట నూనె ఇంత భారీగా పెరగడం మాటలు కాదు. ఎంత పెరిగినా ఆయిల్ వాడడం తప్పదు కదా.. కానీ స్కూలుకు వెళ్లి వచ్చే క్రమంలో నాకు చాలా మంది పరిచయం అవుతారు. చెంచాలో సగం నూనె వాడుతున్న వాళ్లను చూశాను. తక్కువకు వస్తుందని చవక రకం నూనెలు వాడడం మొదలుపెట్టిన వారిని కూడా చూశాను'' అని బీబీసీతో చెప్పారు సునీత. వంట నూనె ధరలు డబుల్ కంటే ఎక్కువ పెరగడంతో ఆమె కిరాణా షాపు బడ్జెట్టే తలకిందులైంది.

మధ్య తరగతి సునీత ధరలు పెరిగినా, నూనె బ్రాండ్ మార్చే సాహసం చేయలేదు. ఎందుకంటే నూనె గుండె జబ్బులకు డైరెక్ట్ లింకు అని మధ్య తరగతి బాగా గుర్తిస్తుంది. కానీ పేదల పరిస్థితి అలా కాదు. చాలా పేద కుటుంబాలు నూనె పాకెట్లు కొనవు. చిన్న కిరాణా షాపుల్లో వంద గ్రాములు, 50 మిల్లీ లీటర్లు ఇలా కొంటూ ఉంటారు. వారు షాపులకు వెళ్లి 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు ఇలా నూనె అడిగితే, షాపు యజమానులు చిన్న చిన్న పాలీథీన్లలో వంట నూనె అమ్ముతారు. ఇలాంటి కుటుంబాలపై నూనె ధరల పెరుగుదల ప్రభావం ఇంకా పెరిగింది.

వంట నూనే కాదు, ఇంధన నూనెలు.. అదేనండీ పెట్రోల్ కూడా పేద - మధ్య తరగతి కొంప ముంచాయి. ''చాలా కాలం కాచీగూడ నుంచి అమీర్ పేటకు 10-11 రూపాయల టికెట్ ఉండేది. ఇప్పుడు 30 రూపాయలు దాటింది. షేర్ ఆటోల సంగతి చెప్పక్కర్లేదు. పెట్రోల్ రేటు గురించి రోజూ మీరు వార్తల్లోనే చూస్తున్నారు. ''మూడేళ్ల క్రితం 75-80 రూపాయలు ఉండేది పెట్రోలు. ఇప్పుడు 110 అయింది. వాస్తవానికి 120 అయితే, మొన్నామధ్య పెంచి మళ్లీ 10 రూపాయలు తగ్గించారు కదా. అంటే ఏకంగా మూడేళ్లలో 30 రూపాయల పైన పెట్రోల్ పెరిగింది. దానికి తోడు అప్పట్లో ఆయన బండి ఒకటే. ఇప్పుడు పిల్లలు కూడా బండ్లు నడపడం మొదలుపెట్టారు. బడ్జెట్ ఎంత పెరిగిందో మీరే అర్థం చేసుకోండి.'' అన్నారు సునీత. ''అప్పట్లో 2 వేల నుంచి రెండున్నర వేలలో పెట్రోల్ ఖర్చు అయిపోయేది. ఇప్పుడు ఆరు వేలు దాటుతోంది'' అన్నారు ఆమె.

పెట్రోల్ ధరల సునీత కుటుంబంపై ప్రత్యక్షంగా ప్రభావం చూపితే, డీజిల్ ధరలు పరోక్షంగా ప్రభావం చూపింది. డీజిల్ పెరుగుదలతో ఆటో చార్జీలు పెరిగాయి. సరుకు రవాణా ఖర్చు పెరుగుతుంది కాబట్టి, సరుకుల ధరలూ పెరిగాయి. అన్నీ కలపి కుటుంబ బడ్జెట్ పెరిగిపోయింది.

కందిపప్పు

పాల ధరలు కూడా బాగా పెరిగాయి అంటున్నారామె. మూడేళ్ల క్రితం వరకూ, ఇంటికి చుట్టాలు వస్తే, వారికి టీ ఇవ్వడం కోసం, 200 మిల్లీలీటర్ల చిన్న పాల పాకెట్ ఐదు రూపాయలకు కొన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నారు సునీత. సుమారుగా లీటర్ 30 రూపాయలు, బ్రాండ్ ను బట్టి పాల ధర ఉండేదనీ, ఇప్పుడు 55 రూపాయలు సుమారుగా ఉంటోందనీ ఆమె చెప్పుకొచ్చారు. పాల నిత్యావసరం దాని ధరల ప్రభావం వివరించక్కర్లేదు.

అయితే స్కూల్ ఫీజుల విషయంలో చాలా ఆసక్తికర విషయం చెప్పారామె. మరీ చిన్న స్కూల్స్ విషయంలో ఫీజులు బాగా పెరగలేదు అంటున్నారామె. ''కరోనా తరువాత తల్లితండ్రులు, చిన్న స్కూళ్లతో బాగా బేరాలు ఆడారు. ఇంతే ఉంది. ఇంతే కట్టగలం. ఇంతకంటే చేయలేం అంటూ చెప్పేశారు. దీంతో కొన్ని పెద్ద స్కూళ్లలో పెరిగాయేమో కానీ, మరీ చిన్న స్కూళ్లలో ఫీజలు పెద్దగా మారలేదు. యాజమాన్యాలు కూడా పరిస్థితి అర్థం చేసుకున్నాయి.'' అన్నారు సునీత.

మాంసం ధరలు కూడా డబుల్ అయినట్టు చెప్పుకొచ్చారు. నాలుగేళ్ల క్రితం 300 ఉన్న మటన్ ఇప్పుడు 750 అయింది. చికెన్ 100-120 నుంచి 200 పైకి పెరిగింది. ''చాలా మంది మాంసం తినే ఫ్రీక్వెన్సీ తగ్గించారు.'' అన్నారు సునీత.

అయితే ఆహార పదార్థాల్లో కూరగాయలు, బియ్యం ధరలు పెద్దగా పెరగలేదు అంటున్నారామె. ఆ రెండింటి ధరల్లో పెరుగుదల ఉన్నప్పటికీ అది సాధారణంగానే ఉంది తప్ప భయంకరమైన పెరుగుదల కాదని చెబుతున్నారు. కానీ పప్పుల ధరల్లో మాత్రం పెరగుదల ఎక్కువగానే ఉందనీ, దానివల్ల కిరాణా బడ్జెట్ భారీగా పెరిగిందనీ వివరించారు.

''మూడేళ్ల క్రితం 3-4 వేలు అయ్యే కిరాణా బిల్లు ఇప్పుడు 8 వేలు లేనిదే జరగడం లేదు. పిల్లలు పెరగడం, లైఫ్ స్టైల్ మార్పు కూడా కొంత కారణం కావచ్చు. కానీ ధరల పెరుగుదల ప్రభావం కూడా కచ్చితంగా తీవ్రంగా ఉంది.'' అన్నారామె.

కిరాణా కొట్టు

మందులు, బట్టల విషయంలో పెరుగుదల ఉందని ఆమె చెప్పారు. కానీ బట్టలు కొనే ప్రీక్వెన్సీ, బ్రాండును బట్టి అవి మారుతుంటాయన్నారు. మందుల విషయంలో మాత్రం రోజూవారీగా వాడల్సిన షుగర్, బీపీ ట్యాబ్లెట్ల ధరలు బాగా పెరిగాయి అని చెప్పుకొచ్చారు సునీత. ''బట్టల్లో ఛాయిస్ ఉంటుంది. 200 షర్ట్ లేదా 2000 వేల షర్ట్ అనేది మన చేతుల్లో ఉంది. కానీ మిగతా విషయాలు అలా కాదు.'' అన్నారామె.

ఆమెను బాగా బాధిస్తోన్న అంశం గ్యాస్ ధరల పెరుగుదల కూడా. ''700-800 మధ్య ఉండే ధర ఇప్పుడు 1100 అయిపోయింది. అటు కరెంటు బిల్లు కూడా అకస్మాత్తుగా బాగా పెరిగింది. స్లాబుల మార్పులతో ఓనర్లు కరెంటు మీటర్ల మీద ఒక నెల అదనంగా కూడా తీసుకున్నారు. కరెంటు బిల్లు చాలా భయపెట్టింది.'' అంటూ వివరించారామె.

నిత్యావసరాలు సరే.. వినోదం గురించి సునీత ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాను సినిమాలు చూడను కానీ స్నేహితుల మాటలను బట్టి అసలు కంటే కొసరు ఖర్చు ఎక్కువని తేలిందనీ అంటున్నారామె. ''టికెట్ 200 వరకూ అవుతోంది. కానీ పాప్ కార్న్, కూల్ డ్రింకుల ధర టికెట్ కంటే రెండు రెట్లు, మూడు రెట్లు ఎక్కువన నా కొలీగ్స్ వాపోతున్నారు. ఆ పాప్ కార్న్, కూల్ డ్రింక్ ధరలు విని ఆశ్చర్యపోయాను.'' అన్నారామె.

''ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. స్కూళ్లలో జీతాలు పెరగలేదు కానీ, మిగిలిన సెక్టార్లలో జీతాలు కాస్త బాగానే పెరిగాయి. అటు ధరలు, ఇటు జీతాలు పెరిగాయి. కాకపోతే ధరల పెరుగుదల భారీగానూ, జీతాల పెరగుదల ఆ స్థాయిలో లేదు. మిడిల్ క్లాస్ బాగా సఫర్ అవుతున్నారు. జీతం పెరిగినా దాని కంటే ఖర్చులు పెరిగాయి. మిగులు తక్కువ అవుతోంది. ఒకప్పుడు 8 వేల జీతంలో కాస్త మిగిల్చే వారు కూడా ఇప్పుడు 18 వేల జీతంలో మిగల్చలేకపోతున్నారు. అదే ఆశ్చర్యం.'' అన్నారు సునీత.

ద్రవ్యోల్బణం, నిరుద్యోగుల శాతం వంటి అర్థ శాస్త్రం లెక్కలు చెప్పలేని విషయాన్ని మధ్య తరగతి గృహణి చెబుతారు. ధరల పెరుగుదల ఎప్పుడూ జరిగేదే కానీ అది పెరిగే వేగం, ఏఏ వస్తువులపై పెరుగుతోంది అనేది ప్రజల జీవన స్థితిగతులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Price Rise-Hyderabad: How will the rise in prices of essential commodities affect a common middle class?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X