లోక్ కల్యాణ్ మార్గ్: భారత ప్రధాని నివాస అడ్రెస్ మారింది
న్యూఢిల్లీ: భారత ప్రధాన మంత్రి అధికారిక నివాసం పేరు మారింది. దేశ రాజధానిలో అందిరికీ సుపరిచితమైన 7 రేస్ కోర్స్ రోడ్డు పేరు ఇక చరిత్రలో కలిసిపోయింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రధాని నివాసంతోపాటు కేంద్ర ప్రభుత్వ అత్యున్నత అధికారుల నివాసాలు ఉన్న దీని పేరును 'లోక్ కల్యాణ్ మార్గ్' పేరుగా మారుస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు.
12 ఎకరాల విస్తీర్ణంలోని ఈ స్థలంలో 5 భవంతులు ఉన్నాయి. వీటిని 1980లో నిర్మించారు. ఇది ప్రధాని ఆఫీస్‌తో పాటు నివసించే జోన్ కావడంతో రేస్‌కోర్స్ రోడ్డు (ఆర్‌సీఆర్) ఏరియాలో పబ్లిక్ రాకపోకలను అనుమతించడం నిలిపివేశారు. 1984లో 7, రేస్‌కోర్స్ రోడ్డులో నివసించిన తొలి ప్రధాని రాజీవ్ గాంధీ.

ప్రధాని నరేంద్ర మోడీ 5 రేస్ కోర్స్ రోడ్డును తన నివాసంగా, 7 రేస్‌కోర్స్ రోడ్డును తన కార్యాలయంగా ఎంచుకున్నారు. అయితే రేస్ కోర్స్ అనే పదం భారత సంస్కృతి, సంప్రదాయాలకు ఏమాత్రం సంబంధంలేనిదని, వలస పాలన కాలం నాటి ఆ పేరును తొలిగించి 'ఏకాత్మ మార్గ్'అని పెట్టాలని బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి ప్రతిపాదించారు.
న్యూఢిల్లీ లోక్ సభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తోన్న ఆమె న్యూఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్(ఎన్‌డీఎంసీ) సభ్యురాలిగా కూడా ఉన్నారు. బీజేపీ సిద్ధాంతకర్త దీనదయాళ్ ఉపాధ్యాయ భావజాలం ఏకాత్మ మానవ దర్శన్‌ను సూచించేలా రేస్ కోర్స్ రోడ్డును 'ఏకాత్మ మార్గ్'గా మార్చాలని ఆమె ప్రతిపాదించారు.
ఈనెల 9న ఎన్‌డీఎంసీకి ఈ ప్రతిపాదనను సమర్పించారు. అయితే, ఎన్‌డీఎంసీలోని ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు మాత్రం ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. 'ఏకాత్మ మార్గ్'కు బదులుగా పరమ్‌వీర్ చక్ర అవార్డు గ్రహీత, అమర జవాను ఫ్లైట్ లెఫ్టినెంట్ నిర్మల్ జిత్ సింగ్ పేరు ఆర్‌సీఆర్‌కు పెట్టాలని ఆప్ ఎమ్మెల్యే సురేందర్ సింగ్ డిమాండ్ చేశారు.
దీనిపై బుధవారం భేటీ అయిన ఎన్‌డీఎంసీ సమావేశంలో 7, రేస్ కోర్స్ రోడ్డు పేరుమార్పుపై ఎట్టకేలకు ఏకాభిప్రాయం కుదిరింది. సమావేశం అనంతరం లోక్ కల్యాణ్ మార్గ్‌గా పేరు మార్పునకు ఏకాభిప్రాయం కుదిరినట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లేఖి బుధవారంనాడు మీడియో సమావేశంలో సంయుక్తంగా ప్రకటించారు.
ఎన్‌డీఎంసీ సమావేశంలో కుదిరిన ఏకాభిప్రాయం ప్రకారం ఇకనుంచి 7 రేస్ కోర్స్ రోడ్డును లోక్ కల్యాణ్ మార్గ్‌గా పిలుస్తారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. 'లోక కల్యాణానికి (ప్రజా సంక్షేమానికి) మించినది ఏది లేదు. అందుకే రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి ఏకగ్రీవంగా పేరు మార్పు నిర్ణయాన్ని తీసుకున్నారు' అని బీజేపీ ఢిల్లీ ఎంపీ మినాక్షి లేఖి తెలిపారు.
కాగా 7, రేస్ కోర్స్ రోడ్డు పేరు మార్పుపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తీసుకున్న ఎన్‌డీఎంసీని ఆయన ట్విట్టర్‌లో అభినందించారు. గతేడాది ఆగస్టులో ఢిల్లీలోని ఔరంగజేబు రోడ్డు పేరును డాక్టర్ ఏపీజే అబ్ధుల్ కలాం రోడ్డుగా మార్చిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications