మరో యాత్రకు రాహుల్ గాంధీ ? జనవరిలో ఈశాన్యం నుంచి ! పార్లమెంట్ వ్యాఖ్యలతో హింట్ ?
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ గతంలో భారత్ జోడో యాత్ర పేరుతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ నడిచారు. అప్పట్లో ఈ యాత్ర విజయవంతం కావడంతో పాటు కర్నాటకలో కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కూడా అందించింది. దీని స్ఫూర్తితో తెలంగాణలోనూ కాంగ్రెస్ తాజాగా అధికారంలోకి వచ్చింది. అయితే తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఉత్తరాదిన కీలక రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బల నేపథ్యంలో రాహుల్ మరో యాత్రకు సిద్ధమయ్యారు.
దేశవ్యాప్తంగా ఎన్నో సమస్యలు ఉన్నా ప్రధాని మోడీకి ప్రత్యామ్నాయం లేదంటూ బీజేపీ చేస్తున్న ప్రచారం నేపథ్యంలో ఓటర్లు కూడా కాషాయ పార్టీవైపే మొగ్గుతున్నారని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. బీజేపీకి అసలైన ప్రత్యామ్నాయం తామే అని నిరూపించుకుంటే తప్ప వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి ఘోర పరాజయం తప్పేలా లేదు. దీంతో మరోసారి ప్రజల్లోకి వెళ్లి నిరుద్యోగం,ధరల పెరుగుదల వంటి సమస్యలపై వారిని చైతన్య పరిచేందుకు రాహుల్ గాంధీ సిద్ధమవుతున్నారు.

ఈసారి ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అసోం లేదా మరో రాష్ట్రం నుంచి రాహుల్ గాంధీ యాత్ర ప్రారంభిస్తారని తెలుస్తోంది. జనవరిలో మొదలుపెట్టి ఎన్నికలు జరిగే వరకూ యాత్ర సాగించాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఈ మేరకు అంతర్గతంగా చర్చిస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. తాజాగా పార్లమెంట్ లో జరిగిన చొరబాటు వెనుక నిరుద్యోగం, ధరల పెరుగుదల అసలు కారణాలంటూ రాహుల్ వ్యాఖ్యానించారు.
దీన్ని బట్టి రాహుల్ గాంధీ త్వరలో చేపట్టే యాత్రలో ధరల పెరుగుదలతో పాటు నిరుద్యోగాన్ని ప్రధానంగా టార్గెట్ చేయబోతున్నారని తెలుస్తోంది. అలాగే తాజాగా మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్ ఘడ్ లో ఓటములతో పార్టీ క్యాడర్ స్ధైర్యం దెబ్బతిన్న నేపథ్యంలో వారిలో సార్వత్రిక ఎన్నికల ముందు తిరిగి ఉత్సాహం నింపేందుకు ఈ యాత్రను ఉపయోగించుకోవాలని రాహుల్ భావిస్తున్నారు. దీంతో ఇండియా కూటమిలో పక్షాల్ని కలుపుకుంటూ ఈ యాత్ర సాగించే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications