రాజకీయ ప్రవేశంపై అమెరికాలో రజినీ మంతనాలు: ఆ తర్వాతే ఎంట్రీ?
చెన్నై: సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ ప్రవేశంపై స్పష్టత రాకపోవడంతో ఆయన అనేక ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా, రజినీకాంత్ అమెరికాలో రాజకీయ సమాలోచనలు జరుపుతున్నారంటూ ఓ వార్త సంచలనంగా మారింది.

విస్తృత చర్చ
గత కొద్ది కాలంగా రజనీకాంత్ రాజకీయరంగ ప్రవేశం గురించి తమిళనాడులో విస్తృత చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. రజనీకాంత్ తన అభిమానులను కలిసిన తరువాత ఆయన రాజకీయరంగ ప్రవేశం ఖాయమని అందరూ భావించారు. కానీ, రజినీ మాత్రం ఇంకా ఎలాంటి స్పష్టమైన ప్రకటనా చేయలేదు.

అమెరికాలోనే కీలక నిర్ణయాలపై..
కాగా రజనీకాంత్ తన తాజా చిత్రం కాలా చిత్రీకరణ కోసం ముంబయి వెళ్లి అనంతరం ఆరోగ్య పరిశోధన రీత్యా తన పెద్ద కూతురు ఐశ్వర్యతో కలిసి అమెరికా వెళ్లారు. రజనీ అమెరికా వెళ్లినప్పుడల్లా అక్కడ దయానంద సరస్వతి ఆశ్రమంలో బసచేసి ధ్యానం చేయడంతో పాటు అక్కడి వారితో తాను తీసుకునే కొన్ని కీలక నిర్ణయాల గురించి చర్చిండం ఆనవాయితీగా వస్తోంది.

కాలా చిత్రం తర్వాతే..
అదే విధంగా ఇప్పుడు తన రాజకీయరంగ ప్రవేశం గురించి కూడా సమాలోచనలు చేస్తున్నట్లు సోషల్‌మీడియాలో ప్రచారం సాగుతోంది. అయితే, అమెరికానుంచి తిరిగొచ్చిన రజనీకాంత్ మళ్లీ ‘కాలా' చిత్ర షూటింగ్‌లో పాల్గొని, చెన్నైకి తిరిగి వచ్చిన తరువాత మరోసారి అభిమానులను కలుసుకోనున్నారు.

స్పష్టత వచ్చే అవకాశం
మరోసారి అభిమానులతో నిర్వహించే సమావేశంలోనే రజినీకాంత్ తన రాజకీయరంగ ప్రవేశం గురించి స్పష్టత ఇస్తారని అందరూ భావిస్తున్నారు. ఇందుకోసం తమిళ ప్రజలు, అభిమానులు వేచిచూడాల్సిందే. అయితే, రజినీ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా రాజకీయాలు ఆయనపై ఒత్తిడి పెంచుతాయని కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications