ఈ వారమే ప్రధాని మోడీతో రజినీ భేటీ: కీలక అంశాలపై చర్చ, స్పష్టత వచ్చేనా?
తాజా సమాచారం ప్రకారం రజినీకాంత్ త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవనున్నట్లు తెలిసింది.
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం మరో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే అభిమానుల సమావేశంలో దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లో వస్తానని, రాజకీయాలు మార్చేయాల్సిందేనని రజినీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే, తాజా సమాచారం ప్రకారం రజినీకాంత్ త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవనున్నట్లు తెలిసింది.

ఈ వారంలోనే..
అది కూడా ఈ వారంలోనే రజినీ ఢిల్లీ పర్యటన ఉంటుందని సమాచారం. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లూ చకచక సాగిపోతున్నాయట. అభిమానుల సమావేశంలో రాజకీయాలపై దాదాపు స్పష్టతనిచ్చేసిన తమిళ అభిమానులపాలిట దేవుడైన రజినీ.. వేగంగా పావులు కదుపుతున్నారు.

రజినీని ఆహ్వానిస్తూనే..
ఒకపక్క రాష్ట్రంలోని అన్నాడీఎంకే రెండు వర్గాలతో కూటమి ఏర్పాటుకు బీజేపీ మొగ్గుచూపుతున్నట్లు కనిపిస్తున్న విషయం తెలిసిందే. అలాగే రజనీకాంత్‌ను మరోపక్క తమ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ఈ క్రమంలో రజనీ వ్యాఖ్యలు... ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారని అభిమానులు పేర్కొనడం ఆసక్తి రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రరాజకీయాల్లో చకచకా మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రధానితో భేటీలో వీటిపైనే చర్చ?
కాగా, ప్రధానితో భేటీలో రజనీకాంత్ రాజకీయరంగ ప్రవేశం, రానున్న రోజుల్లో రాజకీయ వేదికను ప్రారంభించడం, తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై చర్చించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తలైవర్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన ప్రధానితో భేటీ అయిన తర్వాత ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

అలాంటిదేం లేదే!
అయితే రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం అలాంటిదేమీ లేదని చెబుతుండటం గమనార్హం. రాష్ట్రంలోని అన్నాడీఎంకే రెండు వర్గాలు తమతో కలసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయని, భవిష్యత్తులో తాము తీసుకోబోయే నిర్ణయాలకు అనుగుణంగా వారు వ్యవహరిస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. పళనిస్వామి, పన్నీర్‌సెల్వం త్వరలోనే ఒకటవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అయితే, బీజేపీలోకి రావాలంటూ గతంలో రాష్ట్ర బీజేపీ నేతలు కోరిన విషయం తెలిసిందే. సీఎం పదవి కూడా ఆఫర్ చేశారు.












Click it and Unblock the Notifications