బాధించింది: 'అంబరీష్ రాజకీయం'పై రమ్య పశ్చాత్తాపం
బెంగళూరు: ప్రముఖ నటి, మాండ్య కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యురాలు రమ్య సోమవారం పార్టీ సీనియర్ నేత, మంత్రి అంబరీష్ పైన చేసిన వ్యాఖ్యల పైన వివరణ ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం ఓ కళాశాలలో మాట్లాడిన ఆమె... అంబరీష్‌ను తన తండ్రి రాజకీయాల్లోకి తెచ్చినట్లుగా చెప్పారు. దీనిపై అంబరీష్ సతీమణి సుమలత అసంతృప్తి వ్యక్తం చేశారు.
సోమవారం రమ్య తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. అంబరీష్‌ను తన తండ్రి రాజకీయాల్లోకి తీసుకు వచ్చారని తాను చెప్పలేదని, తన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారని ఆమె తెలిపారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. అంబరీష్ తనకు ఆదర్శమని ఆమె చెప్పారు. అంబరీష్ తన రాజకీయ గురువు అన్నారు.

ఇలాంటి వివాదాలు తనను బాధించాయని రమ్య అన్నారు. అంబరీష్ పట్ల తాను చేసిన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకోవడం బాధించిందని అభిప్రాయపడ్డారు. తన వ్యాఖ్యలు అంబరీష్ అభిమానులను బాధిస్తే మళ్లీ మళ్లీ పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానని చెప్పారు. అంబరీష్ తొలుత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినపుడు జడి(ఎస్) పార్టీలో ఉన్నారని.. ఆ పార్టీ నుండి అంబరీష్ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి తన తండ్రితో పాటు ఎస్ఎం కృష్ణ కృషి చేసారని తాను వ్యాఖ్యానించానని, తన తండ్రి వల్లే అంబరీష్ రాజకీయాల్లోకి వచ్చారని తాను వ్యాఖ్యానించలేదన్నారు.
కాగా, ప్రముఖ కన్నడ నటి, మాండ్య కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యురాలు రమ్య అలియాస్ రమ్య దివ్య స్పందన గత నెల మాట్లాడుతూ... ప్రముఖ నటుడు, మంత్రి అంబరీష్‌ను రాజకీయాల్లోకి తీసుకు వచ్చింది తన తండ్రేనని చెప్పారు. కెఆర్ పీట్ కళాశాలలో రమ్య విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.












Click it and Unblock the Notifications