రెడ్ జోన్ ఏరియాల్లో లాక్‌డౌన్ కంటిన్యూ..?గ్రామీణ ప్రాంతాల్లో ఎత్తివేత? ట్రాన్స్‌పోర్టుకు నో పర్మిషన్
కరోనా వైరస్ ప్రభావం లేని జిల్లాల్లో లాక్‌డౌన్ ఎత్తివేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. దేశంలో 290 జిల్లాల్లో వైరస్ ప్రభావం లేదు అని.. ఆయా జిల్లాల్లో మే 3వ తేదీ తర్వాత లాక్ డౌన్ తీసివేస్తామనే ఆలోచనలో ఉంది. అయితే హాట్ స్పాట్, రెడ్ జోన్, కంటైన్మెంట్ జోన్లలో మాత్రం పరిస్థితి అలానే కొనసాగుతోందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పష్టంచేశారు. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మరింత కఠినంగా వ్యవహరిస్తామని తేల్చిచెప్పారు. ఢిల్లీలో గల కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కరోనా వైరస్ ప్రభావాన్ని నిత్యం సమీక్షిస్తున్నారు.

గ్రామాలకు సడలింపు..
గ్రామీణ ప్రాంతాల్లో సడలింపులు ఇవ్వాలని కేంద్రం ఆలోచిస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు. దీనిపై మే 2 లేదా 3వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటన చేసే అవకాశం ఉంది. దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రులు అభిప్రాయాన్ని మోడీ తీసుకున్నారని తెలిపారు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌తో కూడా చర్చించి.. వైరస్‌ను అరికట్టే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.

ప్రజా రవాణాకు నో..
దేశంలో ఇప్పట్లో ప్రజారవాణా వ్యవస్థను అనుమతించబోమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. వైరస్ వ్యాపించే అవకాశం ఉన్నందున కఠిన నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఇతర దేశాలతో పోల్చితే వైరస్ నియంత్రణలో భారత్ మెరుగైన స్థితిలో ఉంది అని తెలిపారు. వైరస్ నివారించడంలో ఆయా ప్రభుత్వాలు చక్కగా పనిచేస్తున్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా అన్నిరాష్ట్రాలు సమన్వయంతో వర్క్ చేస్తున్నాయన్నారు. టీం ఇండియా స్పిరిట్‌తో అందరూ పనిచేస్తున్నారని తెలిపారు. గుజరాత్‌లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మత్య్సకారులను మంగళవారం తరలిస్తామని కిషన్ రెడ్డి స్పష్టంచేశారు.

30 శాతం సిబ్బంది..
వైరస్ తీవ్రత దృష్ట్యా అన్ని కార్యాలయాలు 30 శాతం సిబ్బందితో పనిచేస్తాయని తెలిపారు. జాయింట్ సెక్రటరీ, సెక్రటరీ స్థాయి అధికారి హోదాతో 30 శాతం సిబ్బంది పనిచేస్తున్నారని పేర్కొన్నారు. అంతకుమించి కార్యాలయానికి రావడం లేదన్నారు. కార్యాలయాల్లో కూడా సామాజిక దూరం పాటిస్తున్నామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications