దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు.. భద్రత కట్టుదిట్టం..
దేశవ్యాప్తంగా 77వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరగనున్నాయి. గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశ రాజధాని దిల్లీ ముస్తాబైంది. ఈ మేరకు దిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈసారి ఏకంగా 10 వేల మంది పోలీసులతో పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు. ఏఐ సాంకేతికతను కూడా వినియోగించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. మరోవైపు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు.
దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా 2,500 మందికిపైగా కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. అలాగే మేడ్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్, డిజిటల్ పేమెంట్స్, వ్యాక్సిన్ ప్రొడక్షన్, యూపీఐ వంటి అంశాలు రిపబ్లిక్ డే పరేడ్ లో ప్రాధాన్యం కానున్నాయి. మరోవైపు ఈ వేడుకకు హాజరయ్యే ప్రతి ఒక్కరి భద్రతను దృష్టిలో పెట్టుకుని కఠినమైన భద్రతా ప్రోటోకాల్స్ ను అమలు చేస్తున్నట్లు దిల్లీ అదనపు పోలీస్ కమిషనర్ దేవేశ్ కుమార్ వెల్లడించారు.

అటు తెలంగాణ, ఏపీ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధం అయ్యాయి. ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారిగా రాష్ట్రస్థాయి రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటివరకు ఈ వేడుకలు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగేవి. అయితే ఈసారి రాజధాని అమరావతి వేదికగా ఈ వేడుకలు జరగనున్నాయి. అమరావతిలో తొలిసారి జరిగే ఈ వేడుకలకు హాజరయ్యే ప్రజలు, వీఐపీ, వీవీఐపీల కోసం భారీ ఏర్పాట్లు చేశారు. వీఐపీ, వీవీఐపీ వాహనాల పార్కింగ్ కు 15 ఎకరాలు, ప్రజల వాహనాల కోసం మరో 25 ఎకరాలు కేటాయించారు. మొత్తం 13 వేల మంది కూర్చునేలా సీటింగ్ ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications