
రిలయన్స్.. కలలో కూడా ఊహించనంతగా: రూ.14 లక్షల కోట్లు: కళ్లు తిరిగే మార్కెట్ క్యాపిటల్
ముంబై: దేశీయ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) మరో అద్భుతాన్ని సాధించింది. పారిశ్రామిక రంగంలో అరుదైన ఘనతను సాధించింది. కార్పొరేట్ సెక్టార్ కలలో కూడా ఊహించుకోలేని రికార్డును నెలకొల్పింది. ఇంతవరకూ ఏ సంస్థ కూడా అందుకోని మైలురాయిని స్థాపించింది. మార్కెట్ క్యాపిటల్ (ఎం-క్యాప్) వ్యాల్యూలో 200 బిలియన్ డాలర్ల మార్క్‌ను అందుకున్న తొలి దేశీయ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రిస్ ఆవిర్భవించింది. ఈ మధ్యకాలంలో రిలయన్స్ ఇండస్ట్రీలో వరుసగా పెట్టుబడుల ప్రవాహం కొనసాగడంతో ఆ సంస్థ మార్కెట్ క్యాపిటల్ వ్యాల్యూ ఈ మార్క్‌ను అందుకుంది.
Recommended Video

14,14,764 లక్షల కోట్లు..
ఫలితంగా బోంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో రిలయన్స్ షేర్ల విలువ అమాంతం పెరిగింది. ఒకేసారి ఆరుశాతం మేర పెరుగుదలను నమోదు చేసుకుంది. ఆరు శాతం అంటే..దాని విలువ 2343.90 రూపాయలకు చేరుకుంది. ఫలితంగా మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ కూడా భారీగా పెరిగింది. 14,147,764 రూపాయల మేర నమోదైంది. స్థూలంగా 192.85 బిలియన్ డాలర్లుగా లెక్కకట్టారు. మొత్తం మార్కెట్ క్యాపిటల్ వ్యాల్యూ 200.68 బిలియన్ డాలర్లుగా నమోదు చేసుకుంది. ఇప్పటిదాకా ఈ మార్క్‌ను అందుకున్న ఘనత ఏ దేశీయ కంపెనీకీ లేదు. రిలయన్స్ తరువాత రెండోస్థానంలో టీసీఎస్ నిలిచింది. టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వ్యాల్యూ 119 బిలియన్ డాలర్లు.

పెట్టుబడుల ప్రవాహం..
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ వ్యాల్యూ ఒక్కసారిగా పెరిగి పోవడానికి ప్రధాన కారణం.. ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న పెట్టుబడులేననే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.తాజాగా అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన సిల్వర్ లేక్ 7,500 కోట్ల రూపాయల మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టిన విషయం తెలిసిందే. సౌదీ అరేబియాకు చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (పీఐఎఫ్, అబుధాబికి చెందిన ముబడల ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ, అబుధాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, ఎల్ క్యాటెర్టన్, కేకేఆర్ వంటి సంస్థలు.. రిలయన్స్ రిటైల్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి.

కేకేఆర్ అండ్ కంపెనీ పెట్టుబడులు..
కేకేఆర్ అండ్ కంపెనీ ఒక బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో ఆ సంస్థ యాజమాన్యం 15 శాతం వాటాను విక్రయించడానికి కసరత్తు చేస్తోంది. దీనివల్ల గరిష్ఠంగా 63 వేల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే సమయంలో అమేజాన్ సంస్థ కూడా 20 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్డడానికి ప్రయత్నాలు ప్రారంభించింది.

అదే దారిలో అమేజాన్ సైతం..
ప్రస్తుతం ఇది చర్చల దశలో ఉంది. అమేజాన్ పెట్టుబడులు పెట్టడమంటూ జరిగితే.. రిలయన్స్ యాజమాన్యం దేశీయ రిటైల్ రంగంలో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. అమేజాన్ సంస్థ 20 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడుల కోసం చర్చలు జరుపుతోంది. ఇదివరకే రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో పెట్టుబడుల ప్రవాహం కొనసాగింది. ఫేస్‌బుక్ వంటి పలు అంతర్జాతీయ సంస్థలు రిలయన్స్‌లో వాటాలను కొనుగోలు చేశాయి. ఫలితంగా ఆ సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ వ్యాల్యూ ఒక్కసారిగా 200 బిలియన్ డాలర్ల మార్క్‌ను అధిగమించేసింది.