కెసిఆర్‌కు 'సమైక్య' విషెస్: చిరుకు ఛాన్స్.. పయ్యావుల
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు సమైక్యాంధ్ర విద్యార్థి ఐక్యకార్యాచరణ సమితి నేతలు సోమవారం పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. నేడు కెసిఆర్ అరవయ్యవ జన్మదినం. దీంతో ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డులో గల కెసిఆర్ నివాసం వద్ద సందడి కనిపిస్తోంది. తుగ్లక్ రోడ్డులో భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
ఆయనకు పలువురు నేతలు, పార్టీకి చెందిన ఎంపీలు, నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. సమైక్యాంధ్ర ఐకాస విద్యార్థి నాయకులు అడారి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో పలువురు కెసిఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపేందుకు వెళ్లారు. వారిని తెరాస కార్యకర్తలు అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా కిషోర్ కుమార్ మాట్లాడారు. తాము కెసిఆర్‌కు పువ్వులు ఇచ్చి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చామని, తెరాస కార్యకర్తలు అడ్డుకున్నారని చెప్పారు. కెసిఆర్‌ను కలిసి రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు బాధ్యత తీసుకోవాలని కోరుదామనుకున్నామని, అవసరమైతే వారే సిఎంగా ఉన్నా తమకు అభ్యంతరం లేదన్నారు. తెరాస అడ్డుకోవడంతో వారికే ఇచ్చి చెప్పామన్నారు. కాగా, ఎంపి వివేక్ నివాసంలో రక్తదాన కార్యక్రమం చేపట్టారు.
రాజకీయ లబ్ధి కోసమే: అశోక్ బాబు
రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెసు పార్టీ విభజన చేపడుతోందని ఎపిఎన్జీవో అధ్యక్షులు అశోక్ బాబు ఆరోపించారు. తమ ధర్నాకు అన్ని అన్ని పార్టీల నేతలను ఆహ్వానించామని చెప్పారు. లోకసభలో ఓటాన్ అకౌంట్ తప్ప మరేదీ పెట్టవద్దన్నారు. మెజార్టీ ప్రజలు రాష్ట్ర సమైక్యం కోరుకుంటున్నారని, తెలంగాణ బిల్లును జాతీయ పార్టీలు అడ్డుకోవాలన్నారు. ప్రస్తుతం కాంగ్రెసు పార్టీ మైనార్టీలో ఉందన్నారు.
చిరుకు, కావూరిలకు ఛాన్స్: పయ్యావుల
కేంద్రమంత్రులు కావూరి సాంబశివ రావు, చిరంజీవిలకు తెలుగు ప్రజల రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని సీమాంధ్ర టిడిపి నేత పయ్యావుల కేశవ్ అన్నారు. లోకసభలో కావూరికి, రాజ్యసభలో చిరుకు ఆ అవకాశం వచ్చిందని, దానిని ఉపయోగించుకోవాలన్నారు. బిల్లును అడ్డుకొని వారు తెలుగు ప్రజల ఐక్యత చాటాలన్నారు.












Click it and Unblock the Notifications