తారుమారు: సత్యం మారి టెక్ మహీంద్ర, రామలింగ రాజుకు 'రియల్' షాక్!
హైదరాబాద్: సత్యం రామలింగ రాజు స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం. సత్యం ఫౌండేషన్ ద్వారా తమకు చాలా సేవలు చేశారని గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు. ఊరికి చేసిన సేవలు మరిచిపోలేమని అంటున్నారు. సత్యం కుంభకోణం కేసులో రామలింగ రాజుకు కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.5 కోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే. దీంతో ఆ గ్రామస్థులు పలువురు ఓ టీవీ ఛానల్ ద్వారా పైవిధంగా స్పందించారు.
ఒకప్పుడు సత్యం రామలింగ రాజు అపాయింట్‌మెంట్ దొరకడమే కష్టంగా ఉండేది. వైట్ కాలర్ ఇమేజ్‌తో ఆయన ఇమేజ్ పూర్తిగా దెబ్బతింది.
సత్యం మారి టెక్
నాడు స్కాంలో కూరుకుపోయిన సత్యం కంపెనీని విక్రయించేందుకు స్వయంగా కేంద్ర ప్రభుత్వమే రంగంలోకి దిగింది. ఒక టీంను ఏర్పాటుచేసి కంపెనీని వేలం వేసింది. దీన్ని టెక్ మహింద్రా కంపెనీ చేజిక్కించుకుంది. సత్యం కంప్యూటర్స్ పేరు టెక్ మహింద్రాగా మారింది.
నాడు సత్యం కుంభకోణాన్ని విదేశీ మీడియా ఇండియన్ ఎన్రాన్ స్కాంగా అభివర్ణించాయి. సత్యం కంపెనీ ఆడిటింగ్ చేపట్టిన ప్రైస్ వాటర్ కూపర్స్ కంపెనీకి అమెరికాలో భారీ జరిమానా విధించారు. కార్పోరేట్ రంగంలో సత్యం స్కాం పెను సంచలనం సృష్టించింది.

సత్యం కంప్యూటర్స్‌ను రామలింగ రాజు దాదాపు 30 ఏళ్ల క్రితం ప్రారంభించారు. 2009 జనవరి వరకు దానికి ఛైర్మన్‌గా కొనసాగారు. 2008 డిసెంబర్‌లో మేటాస్‌ను కొనుగోలు చేసే అంశం తిరగబడటంతో సత్యం కంప్యూటర్స్ కుంభకోణం బయటపడింది. రియల్ ఎస్టేట్, ఇన్ ఫ్రా రంగాలకు చెందిన మేటాస్ ను రామలింగరాజు కుమారులే నిర్వహించేవారు.
అప్పట్లో రియల్ ఎస్టేట్‌కి బాగా బూమ్ ఉండటంతో రామలింగరాజు కంపెనీలో తన షేర్లను తనఖా పెడుతూ వచ్చిన నిధులను మేటాస్ ద్వారా భారీ స్థాయిలో స్థలాలను కొనడానికి మళ్లించారు. కంపెనీ ఆర్థిక పరిస్థితి బాగుంటేనే షేర్లకు మంచి రేటు వస్తుంది. అందుకే అకౌంటింగ్ కుంభకోణానికి తెర తీశారు. లేని లాభాలను ఉన్నట్లుగా చూపడం ద్వారా కంపెనీ ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నట్లు చూపారు. కుంభకోణాన్ని ఆ తర్వాత రామలింగరాజే బయటపెట్టారు.
కాగా, సత్యం కుంభకోణం కేసులో రామలింగ రాజు సహా పదిమందికి ఏడేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. న్యాయస్థానం 973 పేజీల తీర్పును వెల్లడించింది. దోషులను చర్లపల్లి జైలుకు తరలించనున్నారు.
నిందితులు జరిమానా కట్టకుంటే తదిపరి నిర్ణయం కోర్టు తీసుకుంటుందని న్యాయవాదులు చెబుతున్నారు. హైకోర్టులో నెల రోజుల్లో అప్పీలు చేసుకోవచ్చునని న్యాయస్థానం చెప్పింది. తమకు కొంతకాలం శిక్ష తగ్గవచ్చునని భావించినప్పటికీ ఏమాత్రం తగ్గలేదు.












Click it and Unblock the Notifications