ఫాస్టాగ్ యూజర్లు టోల్ గేట్ల వద్ద ఇకపై..!!
జాతీయ రహదారులపై ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటన చేసింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ ఆధారిత టోల్ కలెక్షన్ వ్యవస్థ దేశంలోని అన్ని టోల్ గేట్ల వద్ద అందుబాటులోకి రానుంది. టోల్ ప్లాజాలలో నగదు చెల్లింపు విధానానికి త్వరలో పూర్తిగా తెరదించబోతోంది. భవిష్యత్తులో ఏఐ, ఉపగ్రహ ఆధారిత వ్యవస్థ ద్వారానే టోల్ వసూళ్లు జరిగేలా చర్యలు తీసుకుంటోంది. టోల్ ఛార్జీల వసూళ్లు AI ఆధారిత వ్యవస్థల ద్వారానే జరుగనున్నాయి.
టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపు విధానానికి పూర్తిగా తెరపడబోతోంది. క్యాష్ లెస్ టోల్ ప్లాజాలు అందుబాటులోకి రాబోతోన్నాయి. ఏప్రిల్ 1 నుండి అన్ని టోల్ ప్లాజాలలో ఫాస్టాగ్ (FASTag) లేదా యూపీఐ (UPI) ఆధారిత డిజిటల్ చెల్లింపులను తప్పనిసరి చేయనుంది కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ. దీని ద్వారా జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద రద్దీ గణనీయంగా తగ్గుతుంది.

ప్రస్తుతం దేశంలోని టోల్ ప్లాజాల నిర్వహణ సవాలుగా మారింది. ఫాస్టాగ్ తప్పనిసరి అయినప్పటికీ.. చాలా వాహనాలు వాటిని పాటించట్లేదు. అలాగే రీడర్లు మొరాయించడం, నెట్ వర్క్/సర్వర్ సమస్యలు, ఫాస్టాగ్ రీఛార్జీ అయిపోయిన విషయాన్ని వాహనదారులు విస్మరించడం వంటి పలు సాంకేతిక, ఇతర కారణాల వల్ల టోల్ గేట్ల వద్ద వాహనాల కదలికలు నెమ్మదిస్తోన్నాయి. కొంతమంది డ్రైవర్లు ఇప్పటికీ నగదును ఉపయోగించడం కూడా దీనికి కారణంగా భావిస్తోంది జాతీయ రహదారుల సంస్థ.
నగదు లావాదేవీలను నిర్వహించడం వల్ల జాప్యం తలెత్తుతోందనే నిర్ణయానికి వచ్చింది. వీటి పరిణామాలు ఎలా ఉంటాయనేది మొన్నటికి మొన్న సంక్రాంతి సీజన్ లో చూశాం. పంతంగి టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ల కొద్దీ వాహనాలు వేచి ఉండాల్సొచ్చింది. ఈ సమస్యలను పరిష్కరించడానికి టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను పూర్తిగా రద్దు చేసి, ఫాస్టాగ్ లేదా యూపీఐ ఆధారిత డిజిటల్ వ్యవస్థకు మారాలని NHAI నిర్ణయించింది.
దీనికి తోడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత మల్టీ లేన్ ఫ్రీ ఫ్లోటోల్ ప్లాజాలను ప్రవేశపెట్టాలని కూడా కేంద్రం యోచిస్తోంది. ఇక్కడ వాహనాలు ఆగకుండానే టోల్ పాయింట్ల గుండా వెళ్ళవచ్చు. ఫాస్టాగ్ ఉన్న వాహనం టోల్ ప్లాజా గుండా వెళ్ళినప్పుడు బ్యాంక్ అకౌంట్ నుండి ఆటోమేటిక్‌గా టోల్ మొత్తం కట్ అవుతుంది. ఈ MLFF వ్యవస్థలో హైస్పీడ్, హైరిజల్యూషన్ కెమెరాలు వాహన నంబర్ ప్లేట్లను గుర్తిస్తాయి. ఆటోమేటిక్‌గా బ్యాంక్ ఖాతా నుండి టోల్ ఛార్జీలు డిడక్ట్ అవుతాయి.












Click it and Unblock the Notifications