ఇందులో మీ ఇంటరెస్ట్ ఏంటీ?- పిటీషనర్‌ను ప్రశ్నించిన సుప్రీంకోర్టు జస్టిస్ జేకే మహేశ్వరి బెంచ్..!!
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కొత్తగా రూపుదిద్దుకున్న పార్లమెంట్ భవనం.. ఈ నెల 28వ తేదీన ప్రారంభం కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ భవనాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌కర్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సహా పలువురు కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం వివాదాలకు దారి తీస్తోంది.
రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ భవనాన్ని ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ- మోదీ దీనికి భిన్నంగా వ్యవహరిస్తోన్నారనే విమర్శలు వ్యక్తమౌతోన్నాయి. ఇది- రాష్ట్రపతి హోదాను అవమానించడమేననే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మహిళను రాష్ట్రపతిని చేసినట్లు చెప్పుకొంటోన్న బీజేపీ- ఆమెను కించపరుస్తోందంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

ఇదే విషయంపై సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ జయా సుకీన్ గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగానే కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభించాల్సి ఉంటుందని, ఈ దిశగా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలను జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతిని ఆహ్వానించకుండా లోక్‌సభ సెక్రెటేరియట్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని పిటీషనర్ పేర్కొన్నారు.
ప్రధాని మోదీకి బదులుగా రాష్ట్రపతితో కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 79 ప్రకారం- పార్లమెంట్‌లో రాష్ట్రపతికీ సభ్యత్వం ఉంటుందని గుర్తు చేశారు. ప్రజాస్వామ్య విలువలకు నిలువెత్తు నిదర్శనంగా భావించే పార్లమెంట్ భవనం ప్రారంభ కార్యక్రమానికి దేశ ప్రథమ పౌరురాలిని ఆహ్వానించకపోవడం సరికాదని అన్నారు.

ఈ పిటీషన్ ఇవ్వాళ విచారణకు వచ్చింది. జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ చేపట్టింది. అడ్వొకేట్ జయా సుకీన్ తన వాదనలను వినిపించారు. వాదనల సందర్భంగా బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పిల్‌ను దాఖలు చేయడంలో మీకున్న ఇంటరెస్ట్ ఏమిటంటూ సూటిగా ప్రశ్నించింది. దీనికి- రాష్ట్రపతి దేశ ప్రజలందరికీ ప్రాతినిథ్యాన్ని వహిస్తారని అడ్వొకేట్ బదులిచ్చారు.
ఇలాంటి పిటీషన్లతో సుప్రీంకోర్టు వద్దకు ఎందుకు వచ్చారో తనకు అర్థం కావట్లేదని జస్టిస్ పీఎస్ నరసింహ వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 32 కింద ఈ పిల్‌పై విచారణ చేపట్టలేమని తేల్చి చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 79ను కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘించిందంటూ జయా సుకీన్ వాదించగా.. పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభ కార్యక్రమానికి- ఆర్టికల్ 79కు సంబంధం ఏమిటని జస్టిస్ జేకే మహేశ్వరి ప్రశ్నించారు. జయా సుకీన్ చేసిన వాదనలతో ధర్మాసనం ఏకీభవించలేదు. దీన్ని కొట్టివేస్తోన్నట్లు ప్రకటించారు.












Click it and Unblock the Notifications