పోలింగ్ వేళ.. అట్టుడికిన ఆ నియోజకవర్గాలు
పశ్చిమ బెంగాల్ లో పోలింగ్ ఉద్రిక్తతల మధ్య సాగుతోంది. మొదటి దశలో భాగంగా 152 స్థానాలకు ఈ ఉదయం సరిగ్గా 7 గంటలకు పోలింగ్ ఆరంభమైంది. రెండు దశల్లో ఇక్కడ ఓటింగ్ జరుగనుంది. మిగిలిన స్థానాలకు ఈ నెల 29న పోలింగ్ నిర్వహిస్తారు. మే 4వ తేదీన పశ్చిమ బెంగాల్, తమిళనాడుతో పాటు ఇప్పటికే ఓటింగ్ ముగిసిన కేరళ, అస్సాం, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిల్లో ఓట్లను లెక్కిస్తారు. ఆయా చోట్ల అధికారం ఎవరిదనేది ఆ రోజే తేలుతుంది.
పశ్చిమ బెంగాల్ మాల్దా జిల్లా హరిశ్చంద్రపూర్‌లో రాజకీయ వర్గపోరు చోటు చేసుకుంది. హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. ఆరోపణలు- ప్రత్యారోపణలు తీవ్రం అయ్యాయి. బంగువాలో పోలింగ్ బూత్‌ల వద్ద ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారని, జెండాలను, బ్యానర్లను చించేశారని తృణమూల్ నాయకులు మండిపడుతున్నారు.

ముర్షీదాబాద్ లో కూడా ఇటువంటి పరిస్థితులే తలెత్తాయి. ఉద్వాసనకు గురైన తృణమూల్ నాయకుడు హుమయూన్ కబీర్ స్థాపించిన ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ- టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ వివాదం రాళ్ల రువ్వుకోవడానికి దారితీసింది. పరిస్థితిని అదుపు చేసేందుకు కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. వారిని చెదరగొట్టడానికి లాఠీచార్జి చేశాయి. దీంతో ఎన్నికల ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది. పోలింగ్ కేంద్రానికి రాకుండా తనను అడ్డుకున్నారని హుమయూన్ కబీర్ ఆరోపించారు.
నవ్‌దా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని శివ్‌నగర్ ప్రాథమిక పాఠశాల సమీపంలోని పోలింగ్ స్టేషన్ వద్ద బాంబు పేలుడు సంభవించింది. ఈ ఉదయం 10:59 నిమిషాల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ మహిళ గాయపడ్డారు. పోలింగ్ సమయంలో భయాందోళనలను సృష్టించడంలో భాగంగా బాంబులు విసిరారని స్థానికులు చెబుతున్నారు. ఈ పేలుళ్లలో గాయపడిన మహిళ పరిస్థితి లకడగా ఉంది.
#WATCH | West Bengal Elections 2026 | TMC workers smashed the car of a worker of the Aam Janata Unnayan Party (AUJP) as a clash broke out between the TMC and Aam Janata Unnayan Party (AUJP) party workers in Murshidabad. pic.twitter.com/2XKV0Y4rZ3
— ANI (@ANI) April 23, 2026
ఈ సమాచారం అందిన వెంటనే పోలీసులు, కేంద్ర బలగాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. పహారాను పెంచాయి. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో ఉండే పోలింగ్ కేంద్రాల వద్ద గస్తీని పెంచాయి కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశాయి. ఈ ఉద్రిక్తతలు ఇతర ప్రాంతాలకు వ్యాప్తిచెందకుండా తక్షణమే అడ్డుకున్నాయి. ప్రస్తుతం నవ్‌దా నియోజకవర్గంలో పరిస్థితులు అదుపులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఘటన జరిగిన సమయంలో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి షాహీనా ముంతాజ్ ఖాన్ అక్కడే ఉండటం వల్ల.. ఆమెను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందని పార్టీ నాయకులు ఆరోపించారు. భద్రత ఉన్నప్పటికీ, పోలింగ్ బూత్‌కు ఇంత దగ్గరలో ఇలాంటి ఘటన ఎలా జరిగిందని ప్రశ్నించారు. దీనికి బీజేపీ, సీపీఎం, సీపీఐ, ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీకి చెందిన దుండగులే కారణమని ఆరోపించారు. ఓటర్లను భయపెట్టేందుకే ఈ బాంబు దాడి జరిపారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications