పెను విషాదం- విద్యార్థులపై కుప్పకూలిన స్కూల్ బిల్డింగ్: పలువురి దుర్మరణం?
రాజస్థాన్‌లోని దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రభుత్వ పాఠశాల భవనం కుప్పకూలింది. ఆ సమయంలో తరగతి గదుల్లో 60 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. ఈ ఘటనలో ఇప్పటివరకు నలుగురు విద్యార్ధులు దుర్మరణం పాలయ్యారు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు.
సమాచారం అందిన వెంటనే పోలీసులు, జాతీయ- రాష్ట్ర విపత్తు నిర్వహణ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. కుప్పకూలిన పాఠశాల భవన శిథిలాలను తొలగించడానికి జేసీబీలను రప్పించాల్సొచ్చిందంటే- పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పెద్ద సంఖ్యలో స్థానికులూ శిథిలాల తొలగింపులో పాల్గొంటోన్నారు.

ఈ ఉదయం రాజస్థాన్ ఝలావడ్ జిల్లాలో ఈ దుర్ఘటన సంభవించింది. జిల్లాలోని మనోహర్ థాణా పోలీస్ స్టేషన్ పరిధిలో గల పిప్లోడి గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల.. భవనం ఒక్కసారిగా కూలిపోయింది. కొంతకాలంగా కురుస్తోన్న భారీ వర్షాలే దీనికి కారణమని చెబుతున్నారు.
ఈ దుర్ఘటన జరిగిన సమయంలో తరగతి గదిలో దాదాపు 60కి మంది విద్యార్థులు ఉన్నారని స్థానికులు తెలిపారు. పైకప్పు కూలిన వెంటనే పెద్ద శబ్దం రావడంతో విద్యార్థులు భయంతో కేకలు వేశారు. వెంటనే స్పందించిన గ్రామస్తులు, ఉపాధ్యాయులు శిథిలాలను తొలగించే పనిలో నిమగ్నం అయ్యారు.
సమాచారం అందిన వెంటనే పోలీసులు, జిల్లా పరిపాలనా అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను వెంటనే మనోహర్ థాణాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం మరింత మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు.
జేసీబీల సహాయంతో శిథిలాలను తొలగించే కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు నలుగురు విద్యార్థులు దుర్మరణం పాలైనట్లు సమాచారం అందింది. పలువురు విద్యార్థులు భవన శిథిలాల మధ్య చిక్కుకుని ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరగవచ్చనే ఆందోళన వ్యక్తమౌతోంది.
వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పలువురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులైన విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులు ఆదేశించారు. పాఠశాల భవనం చాలా పాతది కావడంతో వర్షం పడినప్పుడు నీరు కారుతోందని గ్రామస్తులు తెలిపారు.












Click it and Unblock the Notifications