ఘోర రైలు ప్రమాదం, పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్: 125 మంది మృతి, ప్రమాదానికి కారణం అదేనా!
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం ఘోర రైలు ప్రమాదం సంభవించింది. పాట్నా - ఇండోర్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనలో 125 మందికి పైగా దుర్మరణం చెందారు. పలువురు గాయపడ్డారు.
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రైలు ప్రమాదం సంభవించింది. పాట్నా - ఇండోర్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనలో 107 మందికి పైగా దుర్మరణం చెందారని తెలుస్తోంది. చాలామంది గాయపడ్డారు. కాన్పూర్ దేహత్ జిల్లాలోని పుఖ్రాయాన్ వద్ద ఆదివారం తెల్లవారుజామున 3.10 గంటల సమయంలో రైలు పట్టాలు తప్పింది. ప్రయాణీకులంతా గాఢనిద్రలో ఉండగా మొత్తం 14 బోగీలు పట్టాలు తప్పాయి.
సమాచారం తెలియడంతో అధికారులు సంఘటన స్థలం చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. భారీ క్రేన్ల సహాయంతో బోగీలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నారు. రైలు ప్రయాణించే మార్గంలోని ప్రధాన స్టేషన్లలో కాల్‌సెంటర్లు ఏర్పాటు చేశారు. మెడికల్ టీం కూడా సంఘటన స్థలానికి చేరుకుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది.
కాన్పూర్ ఐజీ జాకీ అహ్మద్ ఈ సంఘటన పైన మాట్లాడారు. పాట్నా - ఇండోర్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 63 వరకు ఉందని చెప్పారు.
కాగా, ప్రమాదానికి కారణం రైలు పట్టాలలో పగుళ్లే కారణమని రైల్వే అధికారులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దర్యాఫ్తు అనంతరం కారణాలు తెలియనున్నాయి.సరైన రైల్వే ట్రాక్ నిర్వహణ లేకపోవడం, పట్టాల చుట్టూ, అడుగున కంకర వంటి వాటి పట్ల ఉదాసీనంగా వ్యవహరించడంతో పట్టాల్లో పగుళ్లు ఏర్పాడ్డాయని దీంతో భారీ ప్రమాదం చోటు చేసుకుందనిభావిస్తున్నారు.
ఇక, శతాబ్ధి రైళ్లకు వాడుతున్న అధునాతన లింకీ హాఫ్‌మెన్ బుష్ సిస్టమ్(ఎల్‌హెచ్‌బీ) కోచ్‌లు ఈ రైలుకు కూడా ఉండి ఉంటే మృతుల సంఖ్య బాగా తక్కువగా ఉండేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

హెల్ప్‌లైన్ నెంబర్లు: ఝాన్సీ - 05101072, ఒరాయ్ - 051621072, కాన్పూర్ -05121072, పోక్రయాన్-05113-270239.
రైల్వేస్ అధికార ప్రతినిధి అనిల్ సక్సేనా మాట్లాడుతూ... మృతుల సంఖ్య గుర్తించవలసి ఉందని చెప్పారు. మెడికల్, రెస్క్యూ టీంలు సంఘటన స్థలానికి వెంటనే చేరుకున్నాయని చెప్పారు. 20 మృతదేహాలను వెలికి తీసినట్లు చెప్పారు.
కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు మాట్లాడుతూ.. ప్రమాదానికి బాధ్యులైన వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. రైలు ప్రమాదంలో పలువురి మృతి బాధించిందన్నారు. యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్ని ఆసుపత్రులకు సహాయ సహకారాలపై ఆదేశాలు జారీ చేశారు. ప్రమాద ఘటన నేపథ్యంలో ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించారు.












Click it and Unblock the Notifications