కాంగ్రెస్ తో విభేదాలపై నోరు విప్పిన శశిథరూర్-కీలక వ్యాఖ్యలు..!
కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీతో అంటీ ముట్టనట్టుగా ఉంటూ అధికార బీజేపీకి దగ్గరవుతూ వస్తున్న కేరళలోని తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ బహిరంగంగా మాత్రం ఏమీ మాట్లాడటం లేదు. ఈ నేపథ్యంలోనే కేరళ టూర్ కు వచ్చిన ప్రధాని మోడీకి వెళ్లి ఆహ్వనం పలకడం, ఆపరేషన్ సింధూర్ పై విదేశాలకు వెళ్లే అఖిల పక్ష బృందానికి నేతృత్వం వహించే అవకాశం దక్కించుకోవడం చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి తిరిగొచ్చిన శశి థరూర్ నోరు విప్పారు.
కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని కొంతమందితో తనకు అభిప్రాయ భేదాలు ఉన్నాయని ఈ సందర్బంగా శశిథరూర్ అంగీకరించారు. ప్రస్తుతం కేరళలోని నిలంబూర్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరుగుతున్నందున తాను వాటి గురించి మాట్లాడబోనని అన్నారు. కాంగ్రెస్, దాని విలువలు, దాని కార్యకర్తలు తనకు చాలా ప్రియమైనవారని తెలిపారు. 16 సంవత్సరాలుగా పార్టీ కార్యకర్తలతో తాను సన్నిహితంగా పనిచేశానని, వారిని సన్నిహిత స్నేహితులు, సోదరులుగా చూస్తున్నానని చెప్పుకొచ్చారు.

అయితే, కాంగ్రెస్ నాయకత్వంలోని కొంతమందితో తనకు అభిప్రాయ భేదాలు ఉన్నాయన్నారు. తాను ఏమి మాట్లాడుతున్నానో మీకు తెలుసని కూడా చెప్పేశారు. ఎందుకంటే ఆ సమస్యలలో కొన్ని ప్రజాక్షేత్రంలో ఉన్నాయని, అలాగే మీడియా వాటిని బయటపెట్టింది కూడా అన్నారు. తన అభిప్రాయ భేదాలు జాతీయ లేదా రాష్ట్ర నాయకత్వంతో ఉన్నాయో మాత్రం థరూర్ స్పష్టం చేయలేదు. ఉప ఎన్నికల ఫలితాల తర్వాత ఆ విభేదాల గురించి మాట్లాడవచ్చని హింట్ ఇచ్చారు.
అదే సమయంలో నీలంబూర్ ఉప ఎన్నిక ప్రచారంలో ఎందుకు పాల్గొనలేదన్న ప్రశ్నకు స్పందిస్తూ.. తనకు ఆహ్వానం అందలేదని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీకి దూరం జరుగుతున్న థరూర్ ను పార్టీ కూడా దూరం పెడుతోందని అర్దమవుతోంది.












Click it and Unblock the Notifications