ఊరంతా ఒకే సామూహిక వంటశాల.. వారికి ప్రతీరోజూ పండుగే!
గుజరాత్‌లోని మోహసా జిల్లాలోని చందంకి గ్రామం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు కారణంగా మారింది. ఇక్కడ గ్రామంలోని అన్ని ఇళ్లలోనూ పొయ్యి వెలగదు. ఎందుకంటే ఊరంతా ఒకే సామూహిక వంటశాలను నడుపుతున్నారు. వృద్ధుల ఆరోగ్యం, సంతోషం మరియు సౌకర్యం దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసిన ఈ వినూత్న ఆలోచన చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది.
ఆ గ్రామంలోని వారికి పెద్ద కష్టం
చందంకి గ్రామం చిన్నదే అయినా, గతంలో వేయికి పైగా జనాభా ఉండేది. విద్య, ఉద్యోగాల కోసం యువత నగరాలకు వలస వెళ్లిపోవడంతో ప్రస్తుతం గ్రామంలో 100 మంది మాత్రమే మిగిలారు. వారంతా 70 నుంచి 80 ఏళ్ల మధ్య వయస్సు గల వృద్ధులే. ఇండ్లు, డబ్బు ఉన్నా వయసు కారణంగా రోజువారీ వంట చేసుకోవడం, సరుకులు తెచ్చుకోవడం కష్టంగా మారింది. దీంతో అనారోగ్య సమస్యలు పెరిగాయి.

సామూహిక వంటశాలను ఏర్పాటు చేసిన గ్రామ సర్పంచ్
ఈ సమస్యను గమనించిన గ్రామ సర్పంచ్ పూనంభాయ్ పటేల్ ఒక వినూత్న ఆలోచన చేశారు. అమెరికాలో నివసించి వచ్చిన అనుభవం ఉన్న ఆయన, వృద్ధుల సంక్షేమం కోసం సామూహిక వంటశాలను ఏర్పాటు చేశారు. గ్రామంలోని అనుకూలమైన స్థలంలో వంటశాల నిర్మించి, అర్హులైన సిబ్బందిని నియమించారు.
నెలకు 2,500 ఫీజు చెల్లించి భోజనం
రోజుకు రెండు సార్లు (మధ్యాహ్నం & రాత్రి) భోజనం అందించటంతో పాటు, స్నాక్స్ కూడా అందిస్తారు. ప్రతి రోజు వేర్వేరు రుచికరమైన గుజరాతీ సంప్రదాయ వంటకాలు చేసి పెడతారు. ప్రతి నెలా రూ.2,500 ఫీజు చెల్లించి, వృద్ధులందరూ సమయానికి వంటశాలకు వచ్చి భోజనం చేస్తారు. ఇక్కడ వారు కేవలం ఆహారం మాత్రమే తీసుకోవడం లేదు. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, పాత జ్ఞాపకాలు పంచుకుంటూ, కష్టసుఖాలు చెప్పుకుంటూ సంతోషంగా గడుపుతున్నారు.
సామూహిక వంటశాలకు అనేక ప్రత్యేకతలు
దీంతో వారిలో ఒంటరితనం అనే భావన పూర్తిగా తొలగిపోయింది. ఈ సామూహిక వంటశాలకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. అత్యంత పరిశుభ్రమైన వాతావరణంలో ఆరోగ్యకరమైన, సాంప్రదాయిక వంటకాలు చేసి పౌష్టికాహారం అందిస్తారు.సోలార్ విద్యుత్ ఉపయోగం వల్ల ఖర్చులు తగ్గాయి. సమీప పట్టణం నుంచి సరుకులు గంప గుత్తగా కొనుగోలు చేయడం వల్ల డబ్బులు ఆదా అవుతున్నాయి.
కరోనా సోకని గ్రామం
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కరోనా మహమ్మారి సమయంలో ఈ గ్రామంలో ఒక్క వృద్ధుడు కూడా కరోనా బారిన పడలేదు. సామూహికంగా ఉండడం, పరిశుభ్రత, సకాలంలో ఆహారం వల్ల ఇది సాధ్యమైందని చెబుతున్నారు. తొలి రోజుల్లో గ్రామస్థులు ఈ ఆలోచనను ఆమోదించలేదు. కానీ క్రమంగా దీని ప్రయోజనాలు అర్థమై అందరూ ఆశ్రయించారు. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో మరింత వైవిధ్యమైన వంటకాలు తయారు చేయించుకుంటారు.
సామూహిక వంటశాల కాన్సెప్ట్ సూపర్ కాన్సెప్ట్
ఈ సామూహిక వంటశాల వృద్ధులకు గౌరవప్రదమైన జీవనం కల్పిస్తోంది. వలస వెళ్లిన పిల్లలు కూడా తల్లిదండ్రులకు భోజనవసతి బాగుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చందంకి గ్రామం అనుసరిస్తున్న ఈ సామూహిక వంటశాల కాన్సెప్ట్ సూపర్ కాన్సెప్ట్. ఈ విధానం అనుసరిస్తే బోలెడు బెనిఫిట్స్.












Click it and Unblock the Notifications