హిందుత్వ అజెండాను అడ్డుకుందాం: ఏచూరి, ఇదీ తెలుగు తేజం ప్రొఫైల్
విశాఖపట్నం: హిందుత్వ అజెండాను అడ్డుకోవాల్సిన అవసరముందని సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సీతారామ్ ఏచూరి ఆదివారం అన్నారు. ఏచూరి ఎన్నికను ప్రకాశ్ కారత్ ప్రకటించారు. అనంతరం ఏచూరి మహాసభల్లో మాట్లాడారు. మనం ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉందని చెప్పారు.
పెట్టుబడిదారి విధానం నుండి బయటకు రావాల్సి ఉందని చెప్పారు. మోడీ ప్రభుత్వంలో ప్రజల సమస్యలను ఎత్తి చూపిద్దామన్నారు. తనకు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని చెప్పారు. చరిత్రను తిరగరాసే ప్రయత్నం జరుగుతోందన్నారు. కమ్యూనిస్టుల బలోపేతానికి కృషి చేస్తామన్నారు.
కాగా, 16 మందితో సీపీఎం పొలిట్ బ్యూరో ఉంది. అందులో బిమన్ బసు, రాఘవులు, బృందా కారత్, ప్రకాశ్ కారత్, రామచంద్రన్ పిళ్లై, మాణిక్ సర్కారు, విజయన్, మహ్మద్ సలీమ్, జి రామకృష్ణన్, సుభాషిణి అలీ, హన్నర్ మొల్లా తదితరులు ఉన్నారు.
ఇదీ సీతారామ్ ఏచూరీ...

సీతారామ్ ఏచూరి 1952 ఆగస్టు 12న జన్మించారు. ఆయన తెలుగు మాట్లాడే కుటుంబంలో జన్మించారు. 1970లో ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కళాశాలలో పాఠశాల విద్యను పూర్తి చేశారు. 1975లో జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, ఢిల్లీలో ఎంఏ ఎకనామిక్స్ చేశారు. అక్కడే పీహెచ్‌డీలో చేరినప్పటికీ.. ఎమర్జెన్సీ సమయంలో అరెస్టు కావడంతో పూర్తి చేయలేకపోయారు.
1974లో అతను ఎస్ఎఫ్ఐలో చేరారు. 1986 నుండి పూర్తిస్థాయి రాజకీయాలపై దృష్టి సారించారు. 1985లో సీపీఎం పన్నెండో జాతీయ సభలో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1988లో జరిగిన పదమూడో జాతీయ సభలో కేంద్ర కార్యనిర్వాహకుడిగా ఎన్నికయ్యారు.
1992లో పద్నాలుగో సీపీఎం సభలో పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఎన్నికై కొనసాగుతున్నారు. పశ్చిమ బెంగాల్ నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు. తాజాగా ఇప్పుడు ఆయన 21వ జాతీయ మహాసభలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.












Click it and Unblock the Notifications