అప్పుడు మా అమ్మకు ఊపిరాడలేదు: రాహుల్
షాదోల్: రెండు నెలల క్రితం పార్లమెంటు సమావేశాల్లో ఆహార భద్రత బిల్లు ఆమోదించే సందర్భంలో తన తల్లి సోనియాగాంధీ అస్వస్థతకు గురికావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆవేదనగా చెప్పారు. గురువారం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షాదోల్ నిర్వహించిన కాంగ్రెస్ ర్యాలీలో ఆయన మాట్లాడారు.
అనారోగ్యంగా ఉన్నప్పటికీ పేద ప్రజలకు తక్కువ ధరకే ఆహారాన్ని అందించేందుకు ఉద్దేశించిన ఆహార భద్రత బిల్లుకు ఆమోద ముద్ర వేయాలనే తాపత్రయంతో పార్లమెంట్ సమావేశాలకు సోనియాగాంధీ హాజరయ్యారని రాహుల్ తెలిపారు. ఆగస్టు 26న లోక్‌సభలో తన తల్లి సోనియాగాంధీ అనారోగ్యానికి గురైన విషయాన్ని రాహుల్ తొలిసారి ప్రజలకు వివరించారు. సోనియాగాంధీకి ఊపిరాడని పరిస్థితి ఏర్పడడంతో వెంటనే తను ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

ఆస్పత్రికి తీసుకెళ్లిన సమయంలో తన తల్లి ఊపిరి తీసుకునే స్థితిలో లేదని, తన కళ్లలో నీళ్లు తిరిగాయని చెప్పారు. ఆహార భద్రత బిల్లు ఆమోదం కోసం పోరాడుతున్నాని, అయితే ఆ పని చేయలేకపోతున్నట్లు తనకు సోనియా చెప్పినట్లు రాహుల్ తెలిపారు. ఆ తర్వాత న్యూఢిల్లీలోని ఏయిమ్స్‌లో సోనియాగాంధీ చికిత్స పొందారు.
ఆహార భద్రత బిల్లు పార్లమెంట్ ఆమోదంతో భారతదేశంలోని సుమారు 800 మిలియన్ల ప్రజలకు సబ్సిడీ ధరలలో ఆహార ధాన్యాలు లభించే అవకాశం ఉంటుందని తెలిపారు. కాగా సోనియా గాంధీ 2009 కాంగ్రెస్ ఎన్నికల మెనిఫెస్టోలో ఆహార భద్రత బిల్లును చేర్చారు.












Click it and Unblock the Notifications