మనోహర్ రెడీ: తెలంగాణపై పూర్తి కాని కసరత్తు
న్యూఢిల్లీ/ హైదరాబాద్: తెలంగాణపై కేంద్ర మంత్రుల బృందం (జివోఎం) ఢిల్లీలో ఎడతెగని కసరత్తు చేస్తుండగా, శాసనసభ సమావేశాల నిర్వహణకు హైదరాబాదులో ఏర్పాట్లను స్పీకర్ నాదెండ్ల మనోహర్ బుధవారం సమీక్షించారు. శానససభ సమావేశాల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెల 2వ తేదీన శాసనసభ శీతాకాలం సమావేశం ప్రారంభం కావచ్చునని అంటున్నారు. అయితే, తేదీ ఇంకా ఖరారు కాలేదని, మొదటివారంలో మాత్రం తప్పకుండా శాసనసభా సమావేశాలు ప్రారంభమవుతాయని అంటున్నారు. ఈ సమావేశాలకే రాష్ట్రపతి తెలంగాణ బిల్లుకు పంపే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

కాగా, ఢిల్లీలో మూడున్నర గంటల పాటు రాష్ట్ర విభజనపై కసరత్తులో భాగంగా జివోఎం మూడున్నర గంటల పాటు సమావేశమైంది. అయితే, కసరత్తు పూర్తి కాలేదని తెలుస్తోంది. రేపు గురువారం జరిగే మంత్రి వర్గ సమావేశానికి జివోఎం నివేదిక రావడం కష్టమేనని అంటున్నారు. మళ్లీ ఒకటి రెండు సార్లు జివోఎం సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్సి మహంతి కూడా పాల్గొన్నారు.
జీవోఎం సభ్యులు సుశీల్ కుమార్ షిండే, ఏకే ఆంటోనీ, చిదంబరం, నారాయణస్వామి, జైరాం రమేష్ సమావేశానికి హాజరయ్యారు, వీరప్పమొయిలీ, గులాంనబీ అజాద్‌లు గైర్హాజరయ్యారు. సమావేశంలో కీలకమైన శాఖల ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్స్ ఇచ్చారు. ఆర్థిక, విద్యుత్తు, జలవనరుల శాఖల ఉన్నతాధికారులతో జివోఎం సభ్యులు విడివిడిగా సమావేశమయ్యారు. కేంద్ర హోం శాఖ సలహాదారు, టాస్క్‌ఫోర్స్ అధినేత విజయ్ కుమార్ జివోఎం సమావేశంలో పవర్ పాయింట్ ప్రజంటేష్న్ ఇచ్చారు. ఆర్టికల్ 371డిపై న్యాయ శాఖ అధికారులు కూడా వివరించారు.

హైదరాబాద్‌కు సంబంధించి మూడు ప్రతిపాదనలపై జివోఎం చర్చించినట్లు సమాచారం. హైదరాబాద్‌ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా చేసి తెలంగాణకు పూర్తి అధికారాలు ఇవ్వడం వాటిలో మొదటిది. హైదరాబాద్‌ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా చేస్తూ కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడం. గవర్నర్‌కు హైదరాబాద్‌పై పూర్తి అధికారాలు సంక్రమింపజేయడం మరోటి. ఈ విషయంలో జివోఎం ఒక నిర్ణయానికి రావడం లేదని అంటున్నారు. సీమాంధ్ర రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలనే విషయాన్ని ఆ రాష్ట్రానికే వదిలేయాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
కాగా, భద్రాచలం విషయంలో జివోఎం ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు అంతర్రాష్ట్ర వివాదంలో చిక్కుకోకుండా ముంపునకు గురయ్యే గ్రామాలను సీమాంధ్రలో కలిపి మిగతా భద్రాచలం ప్రాంతాలను తెలంగాణలో ఉంచాలని జివోఎం ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌పై ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాతనే జివోఎం నివేదిక పూర్తవుతుందని అంటున్నారు.
బుధవారం జరిగిన జివోఎం కసరత్తు పూర్తి కాలేదని కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. రేపటి మంత్రి వర్గ సమావేశానికి తెలంగాణ ముసాయిదా నివేదిక రాకపోవచ్చునని ఆయన అన్నారు. మంత్రి వర్గం ముందుకు ముసాయిదా ఎప్పుడు వస్తుందో తెలియదని ఆయన అన్నారు. మొత్తం మీద, జివోఎం కసరత్తు మరింతగా సాగే అవకాశం ఉందని తెలుస్తోంది.
బుధవారం ఢిల్లీ విభజనపై సమావేశాలతో వేడెక్కింది. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు తొలుత కేంద్ర మంత్రి జైరాం రమేష్‌ను కలిశారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి పి. చిదంబరాన్ని, కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్‌ను కలిశారు. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తేనే తాము విభజనకు అంగీకరిస్తామని వారు తేల్చి చెప్పారు. జీవోఎం అధికారిక సమావేశానికి ముందు ఆంటోనీ నివాసంలో కాంగ్రెసు ముఖ్య నాయకులు, జివోఎం సభ్యులు సమావేశమయ్యారు.












Click it and Unblock the Notifications