అవిశ్వాస నోటీసులపై స్పీకర్ ప్రకటన: సభలో గందరగోళం
న్యూఢిల్లీ: తనకు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీసులు అందాయని లోకసభ సభాపతి మీరా కుమార్ మంగళవారం చెప్పారు. సీమాంధ్ర కాంగ్రెసు, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు నిన్న యూపిఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే.
ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైన లోకసభ... సీమాంధ్ర ఎంపీలు నినాదాలు చేస్తూ, వెల్‌లోకి దూసుకు రావడంతో సభను పన్నెండు గంటలకు వాయిదా వేశారు. అనంతరం సభ ప్రారంభం అయ్యాక మీరా కుమార్ తాను అవిశ్వాస తీర్మానం నోటీసులు అందుకున్నానని, వాటిని సభ ముందుంచినట్లు ప్రకటించారు.

రెండోసారి సభ ప్రారంభమయ్యాక కూడా సీమాంధ్ర ఎంపీలు సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ గందరగోళం మధ్యనే స్పీకర్ అవిశ్వాస తీర్మాన నోటీసుల పైన ప్రకటన చేశారు. అనంతరం సభను బుధవారానికి వాయిదా వేశారు. రాజ్యసభలోను గందరగోళం చెలరేగడంతో చైర్మన్ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు.
మరోవైపు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన అన్ని పార్టీల పార్లమెంటు సభ్యులు పార్లమెంటు సెంట్రల్ హాలులో సమావేశమయ్యారు. అవిశ్వాస తీర్మానం పైన వారు చర్చించారు.












Click it and Unblock the Notifications