ప్రయాణికులకు ఇండియన్ రైల్వే దసరా బోనస్?
విజయ దశమి పర్వదినాన్ని పురస్కరించుకొని రైల్వే ప్రయాణికుల రద్దీ ఎక్కువవుతోంది. సాధారణంగా పండగలు, వేసవి సెలవుల సమయంలో రైల్వే అధికారులు ప్రతిరోజు నడిచే రైళ్లకు అదనంగా ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతుంటారు. అయితే వీటిలో ఛార్జీలు రోజూ నడిచే రైలు ఛార్జీలకన్నా ఎక్కువగా ఉంటాయి. ప్రయాణికులపై అదనపు భారం వేయడంద్వారా రైల్వే ఆదాయాన్ని ఆర్జిస్తోందంటూ విమర్శలు వస్తున్నాయి. అయినప్పటికీ రైల్వే మాత్రం తన దారిలో తాను పయనిస్తూనే ఉంది.
అదనపు బాదుడు:15 ప్రత్యేక రైళ్లను నవంబరు నెలాఖరు వరకు పొడిగించారు. వీటికి అదనంగా మరో 22 రైళ్లను పొడిగించారు. రెండు నెలల సమయం అదనపు ఛార్జీల రూపంలో ప్రత్యేక బాదుడు తప్పదని తేలిపోయింది. సికింద్రాబాద్ నుంచి కాకినాడ మధ్య నడిచే రెగ్యులర్ రైళ్లతో పోలిస్తే లింగంపల్లి-కాకినాడ ప్రత్యేక రైలులో ఒక్కో టికెట్ పై రూ.55 నుంచి రూ.320 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ఇవి ఏరోజు సమయానికి చేరుకోవు. అంతేకాదు.. స్టేషన్ లో ట్రాక్ ఖాళీ అయితేనే దీనికి గ్రీన్ సిగ్నల్ వస్తుంది. లేదంటే సిటీ బయటే గంట తరబడి ఎదురుచూడాల్సి వస్తుంది. అదనపు డబ్బులు పెట్టి మరీ టికెట్ కొంటే గంటల తరబడి ఆలస్యంగా నడుస్తూ ఇవి న్యాయం చేస్తున్నాయి. ప్రత్యేక రైళ్లను కూడా రెగ్యులర్ రైళ్లుగా తిప్పాలనే డిమాండ్ రోజురోజుకు ఎక్కువవుతోంది.

మరో రెండు నెలలు:కాజీపేట-తిరుపతి, కాచిగూడ-మధురై, కాచిగూడ-నాగర్ సోల్, హైదరాబాద్-నర్సాపూర్, తిరుపతి-హైదరాబాద్, మచిలీపట్నం-సికింద్రాబాద్, హైదరాబాద్-తిరుపతి, హైదరాబాద్-రక్సౌల్, కాజీపేట-దాదర్, సికింద్రాబాద్-రామనాథపురం, తిరుపతి-సాయినగర్ షిరిడీ, తిరుపతి-అకోలా, విజయవాడ-నాగర్ సోల్, మచిలీపట్నం-ధర్మవరం తదితర రైళ్లను మరో రెండు నెలలపాటు అధికారులు పొడిగించారు.












Click it and Unblock the Notifications