కర్ణాటకలో అదృశ్యమైన కేరళ అమ్మాయి మృతదేహం లభ్యం
కర్ణాటకలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. మూడు రోజుల కిందట అదృశ్యమైన కేరళ అమ్మాయి మృతదేహం లభ్యమైంది. ఇక్కడి పర్యటక ప్రాంతాలను సందర్శించడానికి కుటుంబ సభ్యులతో కలిసి కేరళ నుంచి వచ్చారా యువతి. చిక్ మగళూరు జిల్లాలో ట్రెక్కింగ్ కు వెళ్లి ప్రమాదానికి గురైంది. కాలుజారి 1,500 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. తాజాగా ఆ యువతి మృతదేహాన్ని రెస్క్యూ సిబ్బంది గుర్తించారు.
మృతురాలి పేరు శ్రీనంద. కేరళలోని పాలక్కాడ్ ఆమె స్వస్థలం. కుటుంబ సభ్యుల, ఇతర పర్యాటకులతో కలిసి కర్ణాటకలో విహారానికి వచ్చారు. మొత్తం 40 మందితో కూడిన టూరిస్ట్ గ్రూప్ అది. తొలుత హంపి వెళ్లారు. అక్కడి నుంచి నేరుగా చిక్ మగళూరుకు చేరుకున్నారు. అక్కడే బస చేశారు. ఈ నెల 7వ తేదీన దత్తపీఠం సమీపంలో ఎత్తైన పర్వతాల మధ్య గల మాణిక్యధార వాటర్ ఫాల్ ను సందర్శించడానికి వెళ్లారు. ఆ సమయంలో ఆమె వెంట కుటుంబ సభ్యులెవరూ లేరు. ఇద్దరు, ముగ్గురు స్నేహితులు మాత్రమే ఉన్నారు.

మాణిక్యధార వాటర్ ఫాల్స్ వెళ్లిన అనంతరం శ్రీనంద కనిపించకుండా పోయారు. అదృశ్యం కావడానికి కొద్ది క్షణాల ముందు దత్తపీఠం పర్వతాలపై ఓ రీల్స్ చేశారు. దాన్ని తన తండ్రికి వాట్సప్ చేశారు. కుమార్తె కనిపించకపోవడం, ఫోన్ స్విచాఫ్ రావడంతో కుటుంబ సభ్యులు అక్కడంతా వెదికారు. అయినప్పటికీ ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
శ్రీనందను గుర్తించడానికి అత్యాధునిక డ్రోన్లు, హైరిజాల్యూషన్ థర్మల్ కెమెరాలు, ఇతర సాంకేతిక పరికరాలను వినియోగించారు. ప్రత్యేక బృందాలను మోహరించారు. సుమారు వంద మంది రెస్క్యూ సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. స్థానిక పోలీసులు, అగ్నిమాపక, పర్యాటకం, అటవీ సిబ్బంది, టూరిస్ట్ గైడ్స్.. వీరందరూ శ్రీనంద గాలింపు చర్యల్లో భాగం వహించారు. వారి అన్వేషణ విషాదంతంగా ముగిసింది.
ఈ మధ్యాహ్నం ఆమె మృతదేహాన్ని గుర్తించారు. అరిసినగుప్పి నుండి అయిదు కిలో మీటర్ల దూరంలో 1,500 అడుగుల లోతైన లోయలో మృతదేహం లభించింది. వాటర్ ఫాల్స్ సమీపంలో మెట్లు దిగుతుండగా కాలుజారి కింద పడి ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications