సుబ్రమణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు.. గట్టి కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్
రాజ్యసభలో అడుగుపెట్టడమే ఆలస్యం కాంగ్రెస్ పై మాటల తూటాలు సంధిస్తున్నారు సుబ్రమణ్య స్వామి. ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే కాంగ్రెస్ పై ఘాటైన విమర్శలు చేశారాయన. కాంగ్రెస్ కు తెలిసింది ఇండియన్ రాజ్యాంగం కాదని, ఇటలీ రాజ్యాంగమని ఆయన చేసిన వ్యాఖ్యలు సభలో తీవ్ర దుమారాన్ని రేపాయి. సుబ్రమణ్య స్వామి మాటలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన కాంగ్రెస్ శ్రేణులు.. సుబ్రమణ్యస్వామికి గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు.

కాంగ్రెస్ అభ్యంతరంతో సుబ్రమణ్య స్వామి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు స్పీకర్ కురియన్. అయితే గొడవ అక్కడితో సర్దుమణగలేదు. సభలో అడుగుపెట్టిన రెండు రోజుల్లోనే స్వామి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, రికార్డుల నుంచి తొలగించడం జరిగితే..! ఇక రాబోయే 363 రోజులు ఆయన వ్యాఖ్యలను తొలగిస్తారా..? అని ప్రశ్నించారు కాంగ్రెస్ నేత గులాం నబీ అజాద్. స్వామికి వయసు పెరిగింది గానీ బుద్ధి మాత్రం ఇంకా ఎదగలేదని ఎద్దేవా చేశారు. స్వామి మాటలు రోడ్లపై చిల్లర వ్యక్తులు మాట్లాడుకునే భాషలా ఉందని, పార్లమెంట్ లో వాడే భాష ఇలా ఉండదన్నారు.
మరో కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ మాట్లాడుతూ.. ఇటలీ రాజ్యాంగం అంటూ పరాయిదేశం పేరును ప్రస్తావించి కాంగ్రెస్ పై విమర్శలు చేయడం సరికాదన్నారు. దీంతో ప్రవర్తన మార్చుకోవాల్సిందిగా స్పీకర్ కురియన్ సుబ్రమణ్య స్వామిని మందలించారు. చివరకు మరో బీజేపీ పక్ష ఉపనేత ముక్తర్ అబ్బాస్ నక్వి ద్వారా స్వామికి నచ్చజెప్పాల్పిందిగా కోరారు స్పీకర్ కురియన్.












Click it and Unblock the Notifications