మమతా బెనర్జీకి సుప్రీంకోర్టు బిగ్ షాక్..! బెంగాల్ ఎన్నికల వేళ..!
రేపు పశ్చిమబెంగాల్లో (west bengal) తొలి విడత అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఓవైపు బీజేపీ, మరోవైపు ఎన్నికల సంఘంతో పోరాడుతున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee)కి ఇవాళ సుప్రీంకోర్టు (supreme court) భారీ షాకిచ్చింది. మమత తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా తీవ్ర వ్యాఖ్యలు కూడా చేసింది. ఆమె చర్యలు భారతదేశ ప్రజాస్వామ్య పునాదులకు తీవ్రమైన, ప్రత్యక్ష ముప్పును కలిగిస్తున్నాయని హెచ్చరికలు కూడా చేసింది.
రాజకీయ పార్టీలకు సలహాలు ఇచ్చేందుకు పనిచేస్తున్నఐ ప్యాక్ సంస్థ కార్యాలయంలో గతంలో జరిగిన ఈడీ దాడుల సమయంలో వాటిని అడ్డుకునేందుకు మమతా బెనర్జీ తీవ్రంగా ప్రయత్నించారు. దీనిపై ఈడీ దాఖలు చేసిన కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు ధర్మాసనం..కొనసాగుతున్న దర్యాప్తు మధ్యలోకి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చొరబడి ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టడం సరికాదని వ్యాఖ్యానించింది.

తృణమూల్‌తో కలిసి పనిచేసే ఐ-ప్యాక్ అనే రాజకీయ సలహా సంస్థ కార్యాలయాల్లో తాము జరుపుతున్న దర్యాప్తు, సోదాలకు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, రాష్ట్ర అధికారులు ఆటంకం కలిగించారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టులో ఆరోపించింది. మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా జనవరి ఆరంభంలో ఈ సోదాలు జరిగాయి. అధికారంలో ఉన్న ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా ప్రవర్తించే పరిస్థితి భారతదేశంలో తలెత్తుతుందని అంబేడ్కర్ ఎన్నడూ ఊహించి ఉండరని సుప్రీంకోర్టు మౌఖికంగా వ్యాఖ్యానించింది. ఇది రాష్ట్రానికీ, కేంద్రానికీ మధ్య వివాదం కాదని, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా విచారణ జరుగుతున్న మధ్యలోకి వెళ్లి, ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసి, ఆ తర్వాత 'దీనిని రాష్ట్రానికీ, కేంద్రానికీ మధ్య వివాదంగా మార్చవద్దని చెప్పలేరని సుప్రీంకోర్టు పేర్కొంది.












Click it and Unblock the Notifications