"ఆఫీస్ లవ్" స్టోరీస్‌పై సర్వే.. భారత్‌కి ఎన్నో ర్యాంక్ అంటే ?
ప్రపంచవ్యాప్తంగా ఆఫీస్ లవ్ స్టోరీస్ పెరుగుతుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. డిస్క్రీట్ రిలేషన్‌షిప్‌లకు ప్రసిద్ధి చెందిన "ఆష్లే మాడిసన్" ప్లాట్‌ఫాం.. YouGov సంస్థతో కలిసి 11 దేశాలలో ఈ సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో ఇండియా రెండో స్థానం దక్కించుకోవడం హాట్ టాపిక్ గా మారింది. అంతే కాకుండా తమిళనాడులోని కాంచీపురం పట్టణం భారతదేశంలో వివాహేతర సంబంధాలపై అత్యధిక ఆసక్తి చూపుతున్న ప్రాంతంగా నిలవడం తీవ్ర చర్చకు తెరలేపింది.
తాజా సర్వే ఫలితాల ప్రకారం.. భారతీయులలో 40% మంది తమ సహోద్యోగులతో ప్రేమ సంబంధంలో ఉన్నారని లేదా గతంలో ఉన్నారని అంగీకరించారు. మెక్సికోలో ఈ సంఖ్య 43% కాగా.. యుఎస్, యుకె, కెనడా వంటి దేశాల్లో ఇది 30% మాత్రమే. ఈ అధ్యయనం ప్రకారం పురుషులు మహిళల కంటే కార్యాలయ ప్రేమాయణాల్లో ఎక్కువగా పాల్గొంటున్నారు. 51% మంది పురుషులు తమ సహోద్యోగులతో డేటింగ్ చేసినట్లు చెప్పగా, మహిళలలో ఈ సంఖ్య 36% మాత్రమే ఉన్నట్టు తెలుస్తోంది.

సర్వేలో పాల్గొన్న దేశాలు..
- ఆస్ట్రేలియా
- బ్రెజిల్
- కెనడా
- జర్మనీ
- భారత్
- ఇటలీ
- మెక్సికో
- స్పెయిన్
- స్విట్జర్లాండ్
- యూకే
- యుఎస్
మొత్తం 13,581 మంది ఈ సర్వేలో పాల్గొనగా.. మెక్సికో మొదటి స్థానంలో.. భారతదేశం రెండవ స్థానంలో నిలిచాయి.
అలాగే మహిళలు వృత్తిపరమైన విషయాలలో మరింత జాగ్రత్తగా ఉంటారని ఈ సర్వే వెల్లడించింది. 29% మంది మహిళలు తమ కెరీర్‌పై ప్రభావం పడొచ్చనే భయంతో ఆఫీస్ ప్రేమలను వద్దనుకుంటున్నారని తెలిపారు. ఇదే విషయాన్ని 27% మంది పురుషులలో కూడా గుర్తించారు. 18 నుండి 24 ఏళ్ల వయస్సు గల యువ ఉద్యోగులు ఆఫీస్ రిలేషన్స్ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉన్నారని అధ్యయనం పేర్కొంది.
మరో డేటింగ్ యాప్ "గ్లీడెన్" నిర్వహించిన సర్వే ప్రకారం.. భారతీయులలో 35% మంది ప్రస్తుతం ఓపెన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని తెలిపింది. 41% మంది తమ భాగస్వామి సూచిస్తే అలాంటి సంబంధాన్ని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ఈ ధోరణి కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాకుండా చిన్న పట్టణాల్లో కూడా కనిపిస్తుంది.












Click it and Unblock the Notifications