వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీ20 ప్రపంచకప్: భారత్ చేసిన 7 తప్పులు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్‌లలో జరుగుతోన్న తాజా ఐసీసీ టీ20 ప్రపంచకప్ భారత జట్టుకు పీడకలగా మారింది. టోర్నీలో విజేతగా నిలవాలనుకున్న భారత కల సెమీఫైనల్ కూడా చేరకుండానే ముగిసిపోయింది. నమీబియాతో సోమవారం నాటి మ్యాచ్ కూడా కేవలం లాంఛనంగా మారిపోయింది.

kohli

ఆదివారం న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్‌పై గెలవడంతోనే భారత సెమీఫైనల్ ఆశలు అడుగంటాయి.

అఫ్గానిస్తాన్ కాస్త ప్రతిఘటించి ఎలాగోలా న్యూజిలాండ్‌పై గెలుపొంది ఉంటే... భారత అభిమానులు, న్యూజిలాండ్ అభిమానులు సోమవారం నాటి నమీబియా-భారత్ మ్యాచ్‌పై ఆసక్తి చూపి ఉండేవారు.

కానీ అభిమానులు ఆశించినట్లు ఏం జరగలేదు. గ్రూప్ 'బి'లో 10 పాయింట్లతో పాకిస్తాన్, 8 పాయింట్లతో న్యూజిలాండ్ తొలి రెండు స్థానాల్లో నిలిచి సెమీఫైనల్‌కు చేరుకున్నాయి.

రవిశాస్త్రి లాంటి హెడ్ కోచ్, దూకుడైన కెప్టెన్ కోహ్లి, మెంటార్‌గా ధోని పర్యవేక్షణలోని భారత జట్టు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, జస్‌ప్రీత్ బుమ్రా లాంటి సీనియర్ ప్లేయర్లతో పేపర్‌పై బలంగా కనిపించింది.

కానీ బరిలో దిగాక పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లకు ఎదురు నిలవలేకపోయింది.

వరల్డ్ కప్ నిర్వహిస్తోన్న మైదానాల్లోనే భారత ప్లేయర్లు ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడారు. అక్కడి వాతావరణ పరిస్థితులకు అలవాటుపడ్డారు. కానీ మళ్లీ అవే మైదానాల్లో పరుగులు చేయలేక ఆటగాళ్లు ఎందుకు ఇబ్బంది పడ్డారో ప్రశ్నార్థకం.

ప్రపంచకప్ ప్రారంభానికి ముందు భారత్‌ను టైటిల్ ఫేవరెట్‌గా అందరూ భావించారు. కానీ రెండు మ్యాచ్‌ల ఫలితాలతో అందరి అంచనాలు తలకిందులయ్యాయి. అసలు పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అతి విశ్వాసం

ఈ టోర్నీలో భారత్ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడింది. ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై భారత్‌కు ఘనమైన రికార్డుంది. వన్డే ప్రపంచకప్ టోర్నీలో 7 సార్లు, టీ20 ప్రపంచకప్‌లో 5 సార్లు పాకిస్తాన్‌పై భారత్ గెలుపొందింది.

ఎప్పటిలాగే, ఈసారి కూడా ప్రపంచకప్‌లో పాక్‌పై తమదే పైచేయి అవుతుందని భారత్ గుడ్డిగా నమ్మింది. కానీ అది జరగలేదు. ఏకంగా పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించి బదులు తీర్చుకుంది.

ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే వెనుదిరగడంతో భారత్ కష్టాల్లో పడింది.

విరాట్ కోహ్లి 57 పరుగులు చేసినప్పటికీ, జట్టు మొత్తం కలిసి చేసిన 151 పరుగులు పాకిస్తాన్‌కు సవాల్ విసరలేకపోయాయి.

దీంతో పాక్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈమ్యాచ్‌లో భారత బౌలర్ల డొల్లతనం కూడా బయటపడింది. వారు కనీసం 3 లేదా 4 వికెట్లు కూడా తీయలేకపోయారు.

మరోవైపు పాకిస్తాన్ బౌలర్లు, మ్యాచ్ ముందు రోజు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించారు.

3 వికెట్లు తీసి భారత్‌ను ఇబ్బంది పెట్టిన షహీన్ షా ఆఫ్రిది స్వింగ్ రాబట్టడం కోసం చాలా కష్టపడ్డానని, కానీ అది మంచి ఫలితాన్ని ఇచ్చిందని మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించాడు.

న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో కుదరని జట్టు కూర్పు

పాకిస్తాన్‌ చేతిలో ఓటమితో కంగుతిన్న భారత్‌కు న్యూజిలాండ్ కూడా షాకిచ్చింది. ఈ మ్యాచ్‌లో భారత్ సూర్యకుమార్ యాదవ్ స్థానంలో ఇషాన్ కిషన్‌ను, బౌలర్ భువనేశ్వర్ స్థానంలో శార్దూల్ ఠాకూర్‌ను ఆడించింది.

ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ, టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన భారత ఓపెనింగ్ జోడీని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఓపెనర్‌గా రోహిత్ శర్మను తప్పించి రాహుల్‌తో ఇషాన్ కిషన్‌ను ఓపెనింగ్ జోడీగా పంపించారు.

కానీ, ఈ వ్యూహం బెడిసికొట్టింది. కేవలం 4 పరుగులే చేసి ఇషాన్ కిషన్ అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రోహిత్ శర్మ కూడా 14 పరుగులే చేసి స్పిన్నర్ ఇష్ సోధి బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.

ఇలా బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేయడం వల్ల ఎప్పుడూ మూడో స్థానంలో ఆడే కోహ్లి నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. కానీ ఆ స్థానంలో కోహ్లి (9) పెద్దగా పరుగులు చేయలేకపోయాడు.

టోర్నమెంట్‌లో సురక్షిత స్థానానికి చేరాక లాంఛనంగా జరిగే మ్యాచ్‌ల్లో ఏ జట్టయినా ఇలాంటి మార్పులు ప్రయోగాత్మకంగా చేస్తుంది. కానీ భారత్ కీలక మ్యాచ్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రయోగాలు చేయడంతో కోలుకోలేని దెబ్బ తగిలింది.

కోహ్లి అవుటయ్యాక భారత్ పూర్తిగా నిస్సహాయంగా మారిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా భారత కెప్టెన్ కోహ్లి మ్యాచ్ అనంతరం ఒప్పుకున్నాడు.

''న్యూజిలాండ్ తరహాలో ఉత్సాహంగా ఆడలేకపోయాం. వారితో పోలిస్తే మా బాడీ లాంగ్వేజ్ కూడా సరిగా లేదు'' అని కోహ్లి వ్యాఖ్యానించాడు.

జట్టు సెలెక్షన్‌లో లోపాలు

న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్ల చేతిలో ఓటమి ఎదురయ్యాక జట్టు ఎంపికపై ప్రశ్నలు ఉత్పన్నం కాలేదు. అంతకుముందే ప్రపంచకప్ జట్టు ఎంపిక సరిగా లేదని అందరూ భావించారు.

వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోవడంతో అందరూ భావించిందే నిజమైనట్లు అనిపించింది. ఐపీఎల్‌లో ఫామ్‌లో లేని అరడజను మంది ఆటగాళ్లకు ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కింది.

ఐపీఎల్ ప్రదర్శనల ఆధారంగా ప్రపంచకప్ జట్టును ఎంపిక చేసిన పక్షంలో... లీగ్‌లో భారీగా పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్లను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు. కనీసం వారిపై చర్చ కూడా జరగలేదు.

స్పిన్నర్ యుజువేంద్ర చహల్, గత ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్, ఇటీవల భారత విజయాల్లో కీలక పాత్ర పోషించిన మొహమ్మద్ సిరాజ్ లాంటి ప్లేయర్లను జట్టులోకి ఎంపిక చేయలేదు.

బ్యాటింగ్‌లో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా దారుణంగా విఫలమయ్యారు. రాహుల్ చహర్ కూడా రాణించలేకపోయాడు. టీమ్‌లో పరిస్థితి ఎలా తయారైందంటే... తుది జట్టులో ఎవరిని ఆడించాలి? ఎవరిని పక్కన బెట్టాలి అనేది ఎంచుకోవడం కెప్టెన్ కోహ్లికి కూడా కష్టంగా మారింది.

అశ్విన్‌కు ఆలస్యంగా దక్కిన అవకాశం

పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడం, న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో కేవలం 2 వికెట్లు మాత్రమే తీయడం భారత బౌలింగ్‌లో పస లేదనే విషయాన్ని తేటతెల్లం చేశాయి.

పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్ కూడా తేలిపోయాడు. హార్దిక్ పాండ్యా అసలు బౌలింగ్‌కే రాలేదు. దీంతో బౌలింగ్ కూర్పు చెడిపోయింది. ప్రపంచకప్‌నకు ముందు హార్దిక్ బౌలింగ్ కూడా చేస్తాడని చెప్పారు.

న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో హార్దిక్ 2 ఓవర్లు బౌలింగ్ చేసినప్పటికీ ప్రభావం చూపలేకపోయాడు. అతనితో బలవంతంగా బౌలింగ్ వేయించినట్లుగానే కనిపించింది.

స్పిన్నర్ అక్షర్ పటేల్‌ను జట్టులోకి ఎంపిక చేసినప్పటికీ, చివరకు ఆయనను తప్పించి శార్దుల్‌కు అవకాశం ఇచ్చారు.

జట్టులో షమీ ఉన్నప్పటికీ అవసరమైన సమయాల్లో అతను పామ్‌లోకి రాలేకపోయాడు. అతను ఫామ్ అందుకునే సమయానికి జరగాల్సిందంతా జరిగిపోయింది.

చివరకు బ్యాగ్‌లు సర్దుకునే సమయానికి కెప్టెన్ కోహ్లి, స్పిన్నర్ అశ్విన్‌ను జట్టులోకి తీసుకొచ్చాడు. అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన అశ్విన్ 14 పరుగులకు 2 వికెట్లు తీసి తన విలువ చాటుకున్నాడు.

స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో ఒక వికెట్, నమీబియా మ్యాచ్‌లో 3 వికెట్లతో అశ్విన్ ఆకట్టుకున్నాడు. కానీ పాకిస్తాన్, న్యూజిలాండ్ మ్యాచ్‌లకు అతను తుదిజట్టులో లేకపోవడం చేటు చేసింది.

తొలి రెండు మ్యాచ్‌ల్లో జస్‌ప్రీత్ బుమ్రా తన యార్కర్లు, బౌన్సర్లతో రాణించలేకపోయాడు.

బ్యాట్స్‌మెన్ వైఫల్యం

ఒకవేళ టోర్నీ ఆరంభ మ్యాచ్‌ల్లో అఫ్గానిస్తాన్, స్కాట్లాండ్ లేదా నమీబియాతో భారత్ మ్యాచ్‌లు ఆడి ఉంటే విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌తో పాటుగా రిషబ్ పంత్ ఖాతాలో కూడా మంచి ఇన్నింగ్స్ ఉండేదన్న మాట నిజం.

పాకిస్తాన్, న్యూజిలాండ్‌లపై రిషబ్ అంచనాలకు మేర రాణించకపోవడంతో జట్టుపై మరింత భారం పడింది.

పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో రాహుల్, రోహిత్ త్వరగా అవుటవ్వగానే మిడిలార్డర్‌పై భారం పడింది. దాంతో ఒత్తిడిలో బ్యాట్స్‌మెన్ రాణించలేకపోయారు.

ఈ మ్యాచ్‌లో మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమైనా రిషబ్, కోహ్లి పరుగులు జోడించారు. కానీ వారి సామర్థ్యం మేరకు ఆడలేకపోయారు. న్యూజిలాండ్‌పై అయితే భారత్ 20 ఓవర్లలో కేవలం 110 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఆ తర్వాత అఫ్గానిస్తాన్, స్కాట్లాండ్‌లపై మ్యాచ్‌ల్లో రాహుల్, రోహిత్ శర్మ చెలరేగి ఆడినా భారత్‌కు పెద్దగా ఒరిగిందేమీ లేదు. నిజం చెప్పాలంటే ప్రపంచకప్‌లో భారత వైఫల్యానికి మొదటి కారణం.. తొలి రెండు మ్యాచ్‌ల్లో బ్యాట్స్‌మెన్ పేలవ ప్రదర్శనే.

విరాట్ కోహ్లి, రవిశాస్త్రిల నిర్ణయాల ప్రభావం

ఈ ప్రపంచ కప్ తర్వాత హెడ్ కోచ్ రవిశాస్త్రితో సహా టీమిండియా సహాయక సిబ్బంది మారతారనే సంగతి అందరికీ తెలిసిందే. టోర్నీ జరుగుతుండగానే, భారత కొత్త కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ నియామకం కూడా జరిగింది.

ఈ ప్రపంచకప్‌తో టీ20 కెప్టెన్‌గా కోహ్లి బాధ్యతలు ముగుస్తాయని ఇంగ్లండ్‌తో సిరీస్ సమయంలోనే ప్రకటించారు.

ఆ తర్వాత ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్‌గా కూడా తప్పుకుంటున్నట్లు కోహ్లి ప్రకటించాడు. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ, ప్రపంచకప్‌లో భారత్... కోహ్లికి టైటిల్‌ను అందించడంలో విఫలమయ్యాయి.

జట్టులోని చాలామంది సీనియర్ ప్లేయర్లు హర్ట్ అయ్యారనే వార్తలు వచ్చాయి. జట్టులోని కొంతమంది ప్లేయర్లు తమ పూర్తి సామర్థ్యం మేరకు ఆడట్లేదని ఇంగ్లండ్‌తో రెండో టెస్టు మ్యాచ్ ఓటమి అనంతరం కెప్టెన్ కోహ్లి వ్యాఖ్యానించాడు.

ప్రపంచకప్ తర్వాత తమ పదవుల నుంచి తప్పుకోవాలని కోచ్‌ రవిశాస్త్రి, కెప్టెన్‌ కోహ్లి తీసుకున్న నిర్ణయాలు జట్టుకు ప్రతికూలంగా మారినట్లు అర్థం అవుతోంది.

బహుశా ఈ కారణం వల్లే రవిశాస్త్రి, కోహ్లి కఠిన నిర్ణయాలు తీసుకోలేకపోయారనే వాదనలు కూడా ఉన్నాయి. న్యూజిలాండ్‌తో మ్యాచ్ సందర్భంగా జట్టు ఎంపిక, బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు గమనిస్తే వీటి ప్రభావం ఉన్నట్లు అర్థం అవుతుంది.

ఐపీఎల్ అలసట

'సుదీర్ఘ కాలంగా బయోబబుల్‌లో ఉండటం వల్ల ఆటగాళ్లంతా మానసికంగా విసిగిపోయారని' భారత పేసర్ బుమ్రా ప్రపంచకప్ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పాడు.

బౌలర్ల సంగతి పక్కన పెడితే, ఐపీఎల్ జరిగే సమయంలో బ్యాట్స్‌మెన్ కూడా అలసిపోయినట్లు కనిపించారు.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగిన రెండో దశ ఐపీఎల్ మ్యాచ్‌ల్లో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, అశ్విన్, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, రాహుల్ చహర్ ఆకట్టుకోలేకపోయారు. వీరంతా అదే ఫామ్, అదే ఫిట్‌నెస్, అదే మూడ్‌ను ప్రపంచకప్‌లో కూడా కొనసాగించారు.

ఇలాంటి మానసిక స్థితితో ప్రపంచ కప్ లాంటి మెగా టోర్నీలు గెలవాలంటే అద్భుతాలు జరగాల్సిందే.

మనవరకు ఈ ప్రపంచకప్ ప్రయాణం ముగిసిపోయింది. ఒకవేళ తర్వాతి సీజన్ ప్రపంచకప్ కూడా ఇదే పరిస్థితుల్లో అంటే... మొదట ఐపీఎల్, ఆ తర్వాత వరల్డ్ కప్ టోర్నీ ఆడాల్సి వస్తే పరిస్థితి ఏంటి? ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల బోర్డుల తరహాలో బీసీసీఐ కూడా భారత ఆటగాళ్లను ఐపీఎల్‌కు దూరం పెట్టగలదా?

సెమీస్‌ కూడా చేరకుండా భారత్ ప్రపంచకప్ నుంచి నిష్క్రమించడంతో కెప్టెన్ కోహ్లి ఆశలు అడియాసలయ్యాయి. ఐసీసీ టైటిల్ సాధించాలన్న అతని కల నెరవేరకుండానే అతను కెప్టెన్‌గా తప్పుకుంటున్నాడు.

2017 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో, 2019 ఐసీసీ ప్రపంచకప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడింది. దురదృష్టవశాత్తు, ఇప్పుడు ఈ ప్రపంచ కప్‌లో కూడా ఈ రెండు జట్ల వల్లే భారత్ టైటిల్ వేటకు ఆరంభంలోనే ఎండ్‌కార్డ్ పడింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
T20 World Cup: 7 mistakes made by India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X