ఎమ్మెల్యే కుమారుడికి విజయ్ నామకరణం - ఆ పేరుతో పండుగ..!!
తమిళనాడు సీఎం విజయ్ ఇప్పుడు వరుస నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్నారు. సీఎంగా బాధ్యత లు చేపట్టిన తరువాత తీసుకుంటున్న నిర్ణయాల పైన రాజకీయంగా ఆసక్తి నెలకొంది. డీఎంకే మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విజయ్.. ఇప్పుడు అసెంబ్లీ వేదికగా స్టాలిన్ ను టార్గెట్ చేస్తున్నారు. ఉదయ నిధి స్టాలిన్ సైతం సీఎం విజయ్ ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇదే సమయంలో తన పార్టీ ఎమ్మెల్యే జన్మనిచ్చిన శిశువుకు నామకరణం చేసారు. ఎంపిక చేసిన పేరు ఇప్పుడు వైరల్ అవుతోంది.
సీఎం విజయ్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తున్నారు. రైతులకు రుణ మాఫీ.. తాజాగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించే ప్రతి బిడ్డకూ ఉచితంగా గ్రాము బంగారు ఉంగరాన్ని బహూకరించే 'తాయా మామన్ తంగ మోదిరమ్ తిట్టమ్ (మేనమామ బంగారు ఉంగరం పథకం) ను అమలు ఉత్తర్వులు జారీ చేసారు. కాగా, టీవీకే ఎమ్మెల్యే ఎంఆర్ పల్లవికి పుట్టిన శిశువుకు అధికారికంగా 'తమిళ్ వెట్రికొండన్' అని సీఎం విజయ్ నామకరణం చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల మధ్య పండగ వాతావరణంలో సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఆ పసికందును ఆప్యాయంగా ఒడిలోకి తీసుకొని పేరు పెట్టి ముద్దు చేశారు.

విజయ్ పెట్టిన పేరుతో ఒక్క సారిగా..
కాగా, ఎం.ఆర్. పల్లవి తిరు-వి-కా నగర్ నియోజకవర్గం నుంచి టీవీకే తరఫున తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నిండు గర్భిణిగా ఉన్నప్పటికి ఇంటింటికి ప్రచారం చేసి ఆమె వార్తల్లో నిలిచారు. అయితే పల్లవి టీవీకే పార్టీ మొదటి అక్షరాలు కలిసొచ్చేలా బిడ్డకు పేరు పెట్టాలని బలంగా కోరుకున్నారు. ఇదే విషయాన్ని సీఎం విజయ్ దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన సీఎం టీవీకే పార్టీ స్ఫురించేలా తమిళ్ వెట్రికొండన్ (TVK) అని పేరు పెట్టారు. అయితే 'తమిళ వెట్రి కొండన్' అనే పేరు విజయ్ నటించిన రాబోయే జననాయగన్ చిత్రంలో విజయ్ పాత్ర పేరు కావడంతో ఇప్పుడు ఈ పేరును విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications