మారిన సీఎం ఆఫీస్ అడ్రస్: 6 దశాబ్దాల తర్వాత తమిళనాడు సచివాలయంలో బిగ్ చేంజ్!
తమిళనాడు సచివాలయంలో పరిపాలనా పరంగా ఓ చారిత్రక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు 6 దశాబ్ధాలకు పైగా సచివాలయ ప్రధాన కేంద్రంగా ఉన్న చారిత్రాత్మక ఫోర్ట్ సెయింట్ జార్జ్ ప్రాంగణంలో కొనసాగుతున్న ముఖ్యమంత్రి కార్యాలయాన్ని నమక్కల్ కవిజ్ఞర్ మాలిగై(ఎన్కేఎం) భవనానికి తరలించే ప్రక్రియ ఊపందుకుంది. ఈ సీఎం కార్యాలయం తరలింపుకు ప్రధాన కారణం ప్రస్తుత ఆఫీసులో నెలకొన్న తీవ్రమైన స్థల కొరతే కారణమని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రిగా సి.జోసెఫ్ విజయ్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయనను కలవడానికి వస్తున్న అధికారులు, సందర్శకుల తాకిడి బాగా పెరింది. ఫోర్ట్ సెయింట్ జార్జ్‌లోని మొదటి అంతస్తులో ఉన్న ప్రస్తుత కార్యాలయంలో స్థలం సరిపోకపోవడంతో నమక్కల్ కవిజ్ఞర్ మాళిగైలోని పదో అంతస్తును ఎంపిక చేశారు. పరిపాలనా సౌలభ్యం, సందర్శకుల నిర్వహణను మరింత సులభం చేసేందుకు భద్రతా కారణాల దృష్ట్యా ఈ కొత్త ప్రాంగణానికి మారాలని నిర్ణయించారు. అక్కడ నిర్మిస్తున్న కొత్త కార్యాలయం నుంచి బంగాళాఖాతం సముద్ర తీరం స్పష్టంగా కనిపిస్తుంది.

నమక్కల్ కవిజ్ఞర్ మాలిగై పదో అంతస్తులో కొత్త సీఎం కార్యాలయం
తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయం నమక్కల్ కవిజ్ఞర్ మాలిగై 10వ అంతస్తుకు మారనుంది. 10వ అంతస్తులోని సమావేశ మందిరానికి ఆనుకున్న ఉన్న ప్రస్తుత డైనింగ్ హాల్‌ను సీఎం కార్యాలయంగా పునర్నిర్మిస్తున్నారు. దీని కోసం నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయానికి చోటు కల్పించే క్రమంలో 10వ అంతస్తులో ఉన్న సమాచార, తమిళ అభివృద్ధి శాఖ, హోం శాఖ, వాణిజ్య పన్నుల శాఖలకు చెందిన కొన్ని విభాగాలను వేరే ప్రదేశాలకు తరలిస్తున్నారు.
నమక్కల్ కవిజ్ఞర్ మాలిగై ప్రాధాన్యత
10 అంతస్తులు కలిగిన నమక్కల్ కవిజ్ఞర్ మాలిగై భవనాన్ని 1975లో అప్పటి ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి ప్రారంభించారు. ప్రస్తుతం ఆ భవనంలో 34 ప్రభుత్వ శాఖల కార్యదర్శుల ఆఫీసులు ఉన్నాయి. రాష్ట్రంలోనే ఇది అత్యంత కీలకమైన పరిపాలన విభాగంగా గుర్తింపు పొందింది. ముఖ్యమంత్రి కార్యాలయం ఇక్కడికి మారడం వల్ల కలెక్టర్లు, పోలీస్ సూపరింటెండంట్లతో నిర్వహించే ఉన్నత స్థాయి సమావేశాలకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications