తమిళనాడు గవర్నర్ సంచలనం: ఏకంగా మంత్రిని బర్తరఫ్ చేశారు, సీఎం స్టాలిన్ ఏమన్నారంటే?
చెన్నై: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల మనీలాండరింగ్ కేసులో అరెస్టైన మంత్రి సెంథిల్ బాలాజీకి ఈ నిర్ణయంతో గట్టి షాకిచ్చారు. సెంథిల్ బాలాజీని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తూ గవర్నర్ ఆర్ఎన్ రవి ఆదేశాలు జారీ చేశారు. సెంథిల్ బాలాజీ తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని రాజ్‌భవన్ వర్గాలు పేర్కొన్నాయి.
ఇప్పటికే సెంథిల్ బాలాజీ మనీలాండరింగ్ కేసులో అరెస్టై జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఉద్యోగాలు అమ్ముకోవడంతో సహా సెంథిల్ బాలాజీపై తీవ్రమైన అవినీతి ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో మంత్రిగా ఉంటే విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉందని రాజ్‌భవన్ కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో తక్షణమే ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తున్నట్లు పేర్కొంది.

కాగా, ఇటీవల కాలంలో దేశంలో ఏ గవర్నర్ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. జూన్ 14న మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసింది. జులై 12 వరకు సెంథిల్ బాలాజీ జ్యుడీషియల్ కస్టడీలో ఉండనున్నారు. అన్నాడీఎంకే ప్రభుత్వంలో 2014లో రవాణా శాఖ మంత్రిగా ఉన్న సెంథిల్ బాలాజీపై ఉద్యోగాల కోసం డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. అయితే, ఆ తర్వాత 2018లో డీఎంకే పార్టీలో చేరి ఎన్నికల్లో గెలిచిన సెంథిల్‌కు ఎంకే స్టాలిన్ ప్రభుత్వంలోనూ మంత్రి అయ్యారు.
ఇప్పటికే గవర్నర్, సీఎం స్టాలిన్ మధ్య మాటల యుద్ధ జరుగుతున్న క్రమంలో తాజా నిర్ణయం మరింత దూరాన్ని పెంచినట్లయింది. పాలనలో గవర్నర్ జోక్యం చేసుకోవడంపై స్టాలిన్ సహా మంత్రులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తాజాగా, తన మంత్రివర్గ సహచరుడు సెంథిల్‌ను గవర్నర్ బర్తరఫ్ చేయడంపై సీఎం స్టాలిన్ స్పందించారు. గవర్నర్ రవి తీరును తప్పుబట్టారు. గవర్నర్‌కు మంత్రులను తొలగించే హక్కులేదని.. ఈ అంశాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటామని తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్ ప్రకటించారు. ఇలాంటి నిర్ణయాలు సహించబోమని అన్నారు. గవర్నర్ పరిధి దాటి వ్యవహరిస్తున్నారని అన్నారు.












Click it and Unblock the Notifications