పెద్ద చిక్కు: జయలలిత భవితవ్యం సుప్రీం తీర్పుపైనే!
చెన్నై: తమిళనాడు ఎన్నికల్లో ఘన విజయం సాధించి వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలిత ముందు మరో పెద్ద చిక్కే ఉంది. అదే సుప్రీంకోర్టు విచారణలో ఉన్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.
సుప్రీం కోర్టు విచారణలో ఉన్న ఈ కేసు ఆమెకు భవిష్యత్ ఆటంకాలు సృష్టించే అవకాశం లేకపోలేదు. తమిళనాడు ముఖ్యమంత్రిగా కొనసాగడం అనేది.. ఆ కేసుల తీర్పుల ఆధారంగా ఉండే అవకాశం ఉంది.
గతంలో ట్రయల్ కోర్టు దోషిగా తేల్చడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన జయలలిత.. హైకోర్టు నిర్ధోషిగా తేల్చడంతో మళ్లీ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.

సుప్రీంకోర్టు తీర్పుపైనే జయలలిత భవితవ్యం
జయలలిత మొత్తం రాజకీయ భవిష్యత్ సుప్రీం కోర్టు తీర్పుపైనే ఆధారపడివుంది.
విచారణలో ఉన్న ఈ కేసుపై సుప్రీంకోర్టు జూన్ 1, 2016లో వాదనలను విననుంది.
విచారణ పూర్తయితే జూలైలో సుప్రీం తీర్పు వెలువడే అవకాశం ఉందని పలువురు సుప్రీంకోర్టు న్యాయవాదులు చెబుతున్నారు. తీర్పు జయలలితకు అనుకూలంగా వస్తే ఆమె తమిళనాడు ముఖ్యమంత్రిగా మరో ఐదేళ్లపాటు కొనసాగే అవకాశం ఉంటుంది.
ఒకవేళ హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా, జయలలితను దోషిగా తేల్చుతూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తే మాత్రం ఆమెకు కష్టాలు తప్పవు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, మరో ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండాల్సి వస్తుంది.












Click it and Unblock the Notifications