Sethusamudram : సేతుసముద్రం ప్రాజెక్టు చేపట్టండి- కేంద్రాన్ని కోరిన తమిళనాడు అసెంబ్లీ..
తమిళనాడు అసెంబ్లీలో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రానికి కీలకమైన సేతుసముద్రం ప్రాజెక్టును చేపట్టాలని కేంద్రాన్ని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. రామసేతు వివాదం నేపథ్యంలో తమిళనాడు అసెంబ్లీ చేసిన ఈ తీర్మానం ప్రాధాన్యం సంతరించుకుంది.
కేంద్ర ప్రభుత్వం సేతుసముద్రం ప్రాజెక్టును ఇక ఎలాంటి ఆలస్యం చేయకుండా తక్షణం చేపట్టాలని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన సహకారం అందిస్తామని ప్రతిపాదిస్తూ తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించింది. డీఎంకే సర్కార్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి విపక్ష అన్నాడీఎంకేతో పాటు బీజేపీ సభ్యులు కూడా మద్దతు తెలిపారు. అయితే ఈ ప్రాజెక్టు వల్ల కలిగే లాభనష్టాలపై ఓసారి ఆలోచించాలని స్టాలిన్ సర్కార్ ను కోరాయి.
తమిళనాడు అసెంబ్లీలో ఈ తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం స్టాలిన్.. ఎవరూ దేవుడిని కానీ, ప్రజల విశ్వాసాలను కానీ తప్పుబట్టరని, అయితే అవి సేతుసముద్రం వంటి ప్రాజెక్టుకు అడ్డంకి కారాదన్నారు.

తమిళనాడుతో పాటు భారతదేశ ఆర్థికాభివృద్ధిని బలోపేతం చేయడానికి సేతుసముద్రం ప్రాజెక్ట్ చాలా అవసరమని సీఎం స్టాలిన్ అసెంబ్లీలో తెలిపారు. కొన్ని శక్తులు ప్రాజెక్టును మరింత జాప్యం చేసే ప్రయత్నం మన జాతీయ వృద్ధి ప్రయోజనాలకు విరుద్ధమని అసెంబ్లీ భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 150 ఏళ్ల కలల ప్రాజెక్టును అమలు చేయాలనే తీర్మానాన్ని ముందుకు తీసుకురావడం చారిత్రక బాధ్యతగా తాను భావిస్తున్నట్లు స్టాలిన్ వెల్లడించారు. ఇది అరిగ్నార్ అన్న కలల ప్రాజెక్ట్ అని, దివంగత నేత కలైంజర్ (కరుణానిధి) కష్టపడి అమలు చేసిన ప్రాజెక్టు ఇది అన్నారు.












Click it and Unblock the Notifications