పఠాన్‌కోట్ టెర్రర్ దాడి షాక్: పాక్ నుంచే ట్యాక్సీ బుక్
న్యూఢిల్లీ: పఠాన్‌కోటలోని ఎయిర్ బేస్ పైన దాడి చేసిన ఉగ్రవాదులకు సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. తమను పంపిన పాకిస్తాన్ సూత్రదారులతో ఉగ్రవాదులు నిత్యం ఫోన్లో మాట్లాడుతూ వచ్చారని, పాకిస్తాన్ మొబైల్ నెంబర్ నుంచి కాల్ చేసి ఉగ్రవాదుల కోసం ఓ ట్యాక్సీ బుక్ చేశారని తేలింది.
సమాచారం మేరకు... ఉగ్రవాదులు మొదట టయోటా ఇన్నోవా కారులో ప్రయాణించారు. ఈ కారు డ్రైవరుకు పాకిస్తాన్‌లోని సూత్రధారులు ఫోన్ చేసి వాహనం బుక్ చేసుకున్నారు.
అయితే డ్రైవర్‌కు మొదటి నుంచి పాకిస్తాన్ స్మగ్లర్లు, ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయా? లేక పాక్ మొబైల్ నెంబర్ అని తెలియక అతను ఉగ్రవాదులను వాహనంలో ఎక్కించుకున్నాడా అన్నది నిర్ధారణ కావాల్సి ఉంది.

పఠాన్‌కోటలోని ఓ ప్రదేశానికి తీసుకు వెళ్లి దింపాలని ఉగ్రవాదులు డ్రైవర్‌ను అడిగారు. అయితే మధ్యలోనే ఇన్నోవా వాహనం చెడిపోవడంతో వారు మహేంద్ర ఎస్‌యూవీ వాహనాన్ని హైజాక్ చేశారు.
అందులో ఉన్న ఎస్పీని, ఆయన వంటవాడిని చితకబాది వదిలేశారు. వారితో పాటు మరో నగల వ్యాపారిని బందీగా పట్టుకొని కొంతదూరం వెళ్లాక అతని గొంతు కోసి వదిలేశారు. ఈ క్రమంలోనే వారి మొబైల్ ఫోన్‌ను దొంగిలించిన ఉగ్రవాదులు దాని నుంచి మూడుసార్లు పాకిస్తాన్‌లోని తమ సూత్రధారులకు ఫోన్ చేశారు.
వారు ఫోన్ చేసిన ఈ నెంబర్ నుంచే అంతకుముందు ఇన్నోవా డ్రైవర్‌కు ఫోన్ కాల్ వచ్చింది. ఆ తర్వాత ఒక ఉగ్రవాది తన కుటుంబానికి ఫోన్ చేసి తాను ఆత్మహుతి దాడిలో పాల్గొనబోతున్నట్లు చెప్పాడు. కాగా, ఉగ్రవాదులు పఠాన్‌కోట్ దాడిని జనవరి 1నే ప్లాన్ చేసినట్లుగా కూడా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications