కాంగ్రెస్ కు చెయ్యిచ్చిన చిరు, పవన్ అంతే !
బెంగళూరు: బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) ఎన్నికల ప్రచారంలో మెగాస్టార్ చిరంజీవి పాల్గోంటారని ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ నాయకులు చివరికి కంగుతిన్నారు. ఎన్నికల ప్రచారం ముగిసిపోవడంతో ఎన్ని సీట్లలో గెలుస్తాం అనే ఆలోచనలో పడ్డారు.
బీబీఎంపీ పరిధిలో 198 వార్డులు ఉన్నాయి. అందులో దాదాపు 50 వార్డులలో తెలుగు వారి ప్రభావం ఎక్కువగా ఉంది. ఆ వార్డులలో ఎవ్వరు గెలవాలన్నా తెలుగు వారు ఆధరించి ఓట్లు వెయ్యాలి. కాంగ్రెస్ పార్టీకి చెందిన మెగాస్టార్ ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు.
మెగాస్టార్ చిరంజీవితో పాటు బహుబాష నటి కుష్బూ, మాజీ ఎంపీ, బహుబాష నటి రమ్యా తదితర సినిమా తారలు బీబీఎంపీ ఎన్నికలలో ప్రచారం చేస్తారని కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ చెప్పారు. బీబీఎంపీ ఎన్నికల బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు సైతం వాళ్ల ఫోటోలతో కరపత్రాలు ముద్రించి తారల మీద ఆశలు పెట్టుకున్నారు.

అయితే రమ్యా మినహాయిస్తే ఎవ్వరు ఎన్నికల ప్రచారంలో పాల్గోనక పోవడంతో కాంగ్రెస్ శ్రేణులు నిరాస చెందారు. గురువారం సాయంత్రం 5 గంటలకు బీబీఎంపీ బహిరంగ ఎన్నికల ప్రచారానికి తెరపడుతుంది. ఈనెల 22వ తేదిన శనివారం బీబీఎంపీకి ఎన్నికలు జరగనున్నాయి.
పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూసిన బీజేపీ నేతలు...........!
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను బెంగళూరుకు పిలిపించి ప్రచారం చేయించాలని బీజేపీ నాయకులు ప్రయత్నించారు. అయితే సాధ్యం కాలేదు. ప్రధాని మోదీతో పవన్ కళ్యాణ్ కు మంచి సంబంధాలు ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ తో ప్రచారం చేయించాలని నరేంద్ర మోదీకి వినతి పత్రం ఇచ్చారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడి మీద ఒత్తిడి తీసుకు వచ్చినా సాధ్యం కాలేదు. దివంగత నందమూరి తారక రామారావు కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి మాత్రం ప్రచారం చెయ్యడానికి బెంగళూరు వచ్చారు.












Click it and Unblock the Notifications