కన్నడిగులకు చెవిలో కలర్ ఫుల్ పూలు, తెలంగాణ ప్రజలకు తెల్లటి పూలు, ఇది లెక్క గురు!
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్ణాటక రాష్ట్రం, ఇక్కడి ప్రజల కంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఎంతో ముఖ్యమైనవని, తెలంగాణలో ఎలాగైనా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి ఆ రాష్ట్రాన్ని కూడా లూటీ చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్, కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇచ్చిన ఉచిత హామీలు ఇంకా కర్ణాటకలో పూర్తిగా అమలు కాలేదని, ఇలాంటి ఉత్తుత్తి ఉచిత హామీలు తెలంగాణలో కూడా ప్రకటించి అక్కడి ప్రజలను మోసం చెయ్యడానికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రయత్నిస్తున్నదని, ఎలాగైనా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీని గెలిపించుకోవాలని కుట్రలు పన్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

కర్ణాటకలోని ప్రజల చెవిలో కలర్ ఫుల్ కలర్ ఫుల్ పూలు పెట్టిన సిద్దరామయ్య, డీకే శివకుమార్ అండ్ బ్యాచ్ ఇప్పడు తెలంగాణకు వెళ్లి అక్కడి ప్రజల చెవిలో పూలు పెట్టడానికి అనేక ప్రయత్నాలు చేశారని కర్ణాటకలోని బీజేపీ నాయకులు విరుచుకుపడ్డారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత హామీల కారణంగా కన్నడిగులు పూర్తిగా మోసపోయారని, ఇప్పుడు తెలంగాణ ప్రజలను మోసం చెయ్యడానికి కర్ణాటక నుంచి సిద్దరామయ్య బ్యాచ్ తెలంగాణ వెళ్లి వచ్చిందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత హామీలు నేరవేర్చడంలో సిద్దరామయ్య ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని, ఇప్పుడు ఇలాంటి ఉచిత హామీలు తెలంగాణలోని ప్రజలకు ఇచ్చి అక్కడి అమాయక ప్రజలను మోసం చెయ్యడానికి కాంగ్రెస్ పార్టీ పక్లాప్లాన్ చేసిందని కర్ణాటక బీజేపీ శాఖ ట్వీట్ చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత హామీలకు, కర్ణాటకలోని ఉచిత హామీలకు పోలిక ఇలా ఉంది.

* ప్రతిరోజు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తామని తెలంగాణలో హామీ ఇచ్చారు. అయితే కర్ణాటక ప్రజలకు కరెంట్ కష్టాలు తప్పడం లేదని, కరెంట్ లేక కన్నడిగులు ఇబ్బంది పడుతున్నారని బీజేపీ ఆరోపించింది.
* ఇంటి యజమానికి రూ 4 వేలు ఇస్తామని తెలంగాణలో ఉచిత హామి, కర్ణాటకలో ఇంటి యజమానికి రూ 2 వేలు కూడా ఇవ్వడం లేదు.
* తెలంగాణలో యువతకు, నిరుద్యోగులకు నెలకు రూ 3 వేలు ఇస్తామని ఉచిత హామీ, కర్ణాటకలో ఇంత వరకు ఈ పథకం ప్రారంభం కాలేదు.
* ఆర్ టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. కర్ణాటకలో లాగా తెలంగాణ ఆర్ టీసీ కూడా దివాళ తియ్యడం గ్యారెంటీ అని బీజేపీ ఆరోపణలు చేసింది.
* అన్నభాగ్య పథకం కింద పేదలకు 10 కేజీల ఉచిత బియ్యం అందిస్తామని హామి, మోదీ ప్రభుత్వం ఇస్తున్న 5 కేజీల బియ్యం కూడా ఇవ్వకుండా కర్ణాటకలో కాంగ్రెస్ నాయకులు స్వాహా చేస్తున్నారని, ఇది తెలంగాణలో రిపీట్ అవుతుందని బీజేపీ ఆరోపించింది. మొత్తం మీద కన్నడిగులు మోసపోయినట్లు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ఉచిత హామీలకు మోసపోకూడదని కర్ణాటక బీజేపీ శాఖ మనవి చేసింది.












Click it and Unblock the Notifications