బీభత్సం చేస్తున్న ఏనుగులు: ముగ్గురి బలి
అస్సాం: ఏనుగులు బీభత్సంతో అస్సాంలోని స్థానిక ప్రజలు హడలిపోతున్నారు. భయబ్రాంతులకు గురై సురక్షిత ప్రాంతాలకు మకాం మార్చుతున్నారు. అస్సాంలోని గోల్పారా జిల్లాలో శుక్రవారం రాత్రి ఓ గజరాజు నానా బీభత్సం చేసింది. ఒకే కుటుంబంలోని ఇద్దరు మహిళలు, చిన్నారి పై దాడి చేసింది.
అమాయకులైన వారి ప్రాణాలు గాలిలో కలిపేసింది. విషయం తెలుసుకున్న గెంద్రపారా గ్రామస్తులు గజరాజును అతి కష్టం మీద అటవి ప్రాంతంలోకి పంపించారు. శనివారం ఉదయం ముగ్గురి శవాలను జాతీయ రహదారి 37 పై పెట్టిన గ్రామస్తులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు.
అటవి శాఖ అధికారుల వైఫల్యం వలనే ఏనుగులు గ్రామాల్లోకి వస్తున్నాయని, అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటున్నాయని వారు ఆరోపించారు. నిర్లక్షంగా వ్యవహరిస్తున్న అటవి శాఖ అధికారుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని చుట్టు పక్కల గ్రామస్తులు డిమాండ్ చేశారు.

బాధిత కుటుంబ సభ్యులకు నష్టపరిహారం ఇప్పించి న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు. గత కొంత కాలం నుంచి ఏనుగులు ఈ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నాయని, భయానక వాతావరణం నెలకొందని, అటవి శాఖ అధికారులకు పదేపదే ఫిర్యాదులు చేసినా వారు పట్టించుకోలేదని ఆరోపించారు.
తమ ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని వారు మండిపడ్డారు. అటవి శాఖ అధికారుల నిర్లక్షం వలనే నేడు ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసి పోయాయని విలపించారు. తమ ప్రాణాల విలువ తెలుసుకుని ఇప్పటికైనా మేల్కోని సమస్యల పరిష్కారం చెయ్యాలని, ఏనుగులు గ్రామాల్లోకి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications