కాంగ్రెస్ లో తృణమూల్ విలీనం ? కీలక చర్చలు..! సోనియా ఆఫర్ ఇదే..!
పశ్చిమబెంగాల్లో వరుసగా మూడుసార్లు ప్రభుత్వాలు నడిపి తాజా అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ దెబ్బకు కుదేలైన మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ తిరిగి సొంత గూటికి చేరేందుకు సిద్దమవుతోంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రతిపాదనకు మమతా బెనర్జీ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. టీఎంసీని కాంగ్రెస్ లో విలీనం చేసినందుకు ప్రతిగా పలు కీలక పదవుల్ని ఆఫర్ చేసినట్లు సమాచారం.
కాంగ్రెస్ లో టీఎంసీ విలీనం కోరిన సోనియా (TMC-Congress Merger)
బెంగాల్లో అధికారం కోల్పోయాక వరుసగా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీకి క్యూ కట్టేస్తున్న నేపథ్యంలో ఇండియా కూటమిలో భాగమైన మమతా బెనర్జీ.. తోటి పార్టీ కాంగ్రెస్ సాయం కోరారు. దీంతో మమతా బెనర్జీని ఢిల్లీ పిలిపించుకుని మాట్లాడిన సోనియా గాంధీ.. ఆమె ముందు టీఎంసీ విలీనం ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది. దీనికి ప్రతిగా మమతా బెనర్జీతో పాటు ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ రాజకీయ భవిష్యత్తుకు భరోసా హామీ లభించింది.

సమయం కోరిన మమతా బెనర్జీ
బీజేపీ నుంచి ఎదురవుతున్న రాజకీయ ఒత్తిడిని తట్టుకునేందుకు, విపక్షాల ఉమ్మడి బలాన్ని పెంచే దిశగా సోనియా గాంధీ ఈ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. పార్టీలో గ్రూపు రాజకీయాలు, పెరుగుతున్న అంతర్గత కలహాల నేపథ్యంలో ఈ చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సోనియా గాంధీ స్వయంగా మమతా బెనర్జీకి ఫోన్ చేసి, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఈ ప్రతిపాదనపై వెంటనే ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా, ఆలోచించుకునేందుకు మమతా బెనర్జీ కొంత సమయం కోరినట్లు సమాచారం.

ఆఫర్ చేస్తున్న పదవులు
ఈ విలీనం జరిగితే కాంగ్రెస్ పార్టీలో మమతా బెనర్జీకి 'జాతీయ ఉపాధ్యక్షురాలు' (National Vice President) పదవిని, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి ప్రధాన కార్యదర్శి (General Secretary) పదవిని ఆఫర్ చేసినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ విషయమై కాంగ్రెస్ లేదా టీఎంసీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే తాజాగా అభిషేక్ బెనర్జీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మధ్య జరిగిన సమావేశం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. దాదాపు గంటన్నరకు పైగా జరిగిన ఈ సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై, ఇటీవల ముగిసిన బెంగాల్ ఎన్నికల ఫలితాలపై చర్చించినట్లు తెలుస్తోంది.














Click it and Unblock the Notifications