కాశ్మీర్‌లో భారీ ఉగ్రదాడి- టూరిస్టులపై విచక్షణారహితంగా కాల్పులు
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఉగ్రదాడి చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురు పర్యాటకులు, స్థానికేతరులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే భారీగా సైన్యం సంఘటన స్థలానికి తరలి వెళ్లింది.
అనంతనాగ్ జిల్లాలోని పహల్‌గామ్‌లో ఈ మధ్యాహ్నం ఈ ఘటన సంభవించింది. వేసవి సీజన్ కావడం వల్ల జమ్మూ కాశ్మీర్‌కు పర్యాటకుల తాకిడి భారీగా పెరిగింది. ఎడ తెరిపి లేకుండా అక్కడ మంచు కురుస్తోంది. మంచుకొండల అందాలను తిలకించడానికి వచ్చే సందర్శకులతో అక్కడి పర్యాటక ప్రాంతాలన్నీ కూడా పోటెత్తుతున్నాయి. హిల్ స్టేషన్ పహల్‌గామ్‌లో రద్దీ మరింత అధికంగా ఉంటోంది.

ఈ పరిస్థితుల్లో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. కాల్పులకు తెగబడ్డారు. ఈ మధ్యాహ్నం పహల్‌గావ్‌లో రెండు పర్యాటక బృందాలపై ఉగ్రవాదులు యథేచ్ఛగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పలువురు పర్యాటకులు గాయపడ్డారు. వారిని హుటాహుటిన ఆసుపత్రులకు తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
పహల్‌గామ్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందిన వెంటనే భద్రత బలగాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. పికెట్‌ను ఏర్పాటు చేశాయి. పహల్‌గామ్‌లోకి సాధారణ ప్రజలు, బయటి వ్యక్తులను ఎవ్వరినీ పంపించట్లేదు.
ఒక్కడే ఈ కాల్పులు జరిపినట్లు ప్రత్యక్షసాక్షులు తెలియజేశారు. అతి సమీపం నుంచి అతను పర్యాటకులపై కాల్పులు జరిపినట్లు చెప్పారు. ఈ కాల్పుల్లో ఇప్పటివరకు అయిదుమంది మరణించినట్లు తెలుస్తోంది. మరో 12 మందికి పైగా బుల్లెట్ గాయాలైనట్లు సమాచారం.

గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నందున మృతుల సంఖ్య మరింత పెరగొచ్చనే ఆందోళనలు వ్యక్తమౌతోన్నాయి. మృతుల సంఖ్యను ఇంకా ఎవరూ ధృవీకరించట్లేదు. కాల్పుల ఘటన అనంతరం పహల్‌గామ్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అంబులెన్సులు, ఆర్మీ వాహనాల సైరన్ మోతలతో భీతావహంగా మారింది.

ఈ కాల్పుల ఘటన పట్ల జమ్మూ కాశ్మీర్ లెప్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రక్షణ బలగాలు, పారా మిలటరీ దళాలు, అదనపు పోలీసులను పహల్‌గామ్‌కు తరలించినట్లు ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు.












Click it and Unblock the Notifications